Crime News: పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, 11 మంది అరెస్ట్
BRS MLC Naveen Rao | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

MLC Naveen Raos father caught while playing poker | హైదరాబాద్, ఆగస్టు 17: పేకాట స్థావరాలపై పోలీసులు ఎప్పుడూ నిఘా ఉంచుతారు. వీలు చిక్కినప్పుడల్లా పక్కా సమాచారంతో దాడులు చేసి అరెస్టులు చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు పేకాట ఆడుతూ పట్టుబడి వార్తల్లో నిలిచారు. బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ గెస్ట్ హౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసి ఆయనతో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు ఆకస్మిక దాడి సమయంలో గెస్ట్ హౌస్ నుంచి సుమారు రెండున్నర లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ మూడు లక్షల రూపాయలకి పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
ఎమ్మెల్సీ తండ్రి కొండలరావుతో పాటు ఓ GHMC కార్పొరేటర్ కూడా పేకాట శిబిరంలో ఉండటం మరింత సంచలనంగా మారింది. అదుపులోకి తీసుకున్న వారిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలు రాజకీయ పార్టీల ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు, ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోతోన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






















