Hyderabad Crime News: మైనర్ పై హాస్టల్ యజమాని లైంగిక వేధింపులు, చితకబాదిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు
హైదరాబాద్ లో బాలికపై వేధింపుల కేసులో హాస్టల్ యజమానిపై మాదాపూర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలికను హాస్టల్ యజమాని చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి.

Hyderabad Crime News: బాలికను వేధించిన హాస్టల్ యజమాని
- దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు తల్లిదండ్రులు
- హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఘటన
- NPP ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సత్య ప్రకాష్
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇమేజ్ గార్డెన్ రోడ్‌లోని అర్ణవ్ ప్లాజాలో నడుస్తున్న NPP ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఈ హాస్టల్‌లో ఉంటోంది.
హాస్టల్ లోని వారి ప్రకారం, బాధితురాలి వయస్సు 16 సంవత్సరాలు, ఆమె బోరబండ ప్రాంతానికి చెందినది. మైనర్ బాలికను హాస్టల్ యజమాని చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. వేధింపులు భరించలేక బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోక్సో చట్టం కింద కేసు నమోదు
శనివారం బాధితురాలి తల్లిదండ్రులు, కొంతమంది స్థానిక మహిళలు హాస్టల్‌కు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సమయంలో, కోపోద్రిక్తులైన మహిళలు హాస్టల్ కిటికీ అద్దాలు, ఫర్నిచర్, పూల కుండీలను ధ్వంసం చేశారు, దీంతో హాస్టల్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే మాదాపూర్ పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు, అయితే పోలీసులు వచ్చేలోపు ఆందోళన చేసినవారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలి తండ్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, పోలీసులు హాస్టల్ యజమానిపై భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్లతో పాటు మైనర్ కావడంతో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

తీవ్రతను బట్టి ప్రత్యేక దర్యాప్తు బృందం
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు. బాధితురాలి స్టేట్మేంట్ నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో, హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలికకు వేధింపులపై హాస్టల్‌లోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు.
అంతా అబద్ధమని చెబుతున్న నిర్వాహకులు
మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేదని, అదంతా అబద్ధమని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. బిల్డింగ్ విషయంలో జరుగుతున్న గొడవలో భాగంగా తనపై కొందరు వచ్చి దాడి చేశారని హాస్టల్ నిర్వాహకుడు సత్య ప్రకాష్ తెలిపారు. కావాలనే సన్ సిటీ నుంచి కొందరు గ్యాంగ్ ను తీసుకువచ్చి గొడవ చేశారని ఆరోపించాడు. కాగా, గత మూడు నెలల్లో తనపై ఇలా దాడి జరగడం ఇది రెండవ సారి అని హాస్టల్ నిర్వాహకులు తెలిపారు.






















