Hyderabad Weather: హైదరాబాద్‌లో రాత్రివేళల్లో కుండపోత వర్షం ఎందుకు కురుస్తోంది? ఏబిపి దేశంతో అధికారులు ఏం చెప్పారు?
Hyderabad Weather: తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు దంచికొడుతుంటే ఒక్క హైదరాబాద్‌లో మాత్రం వింత వాతావరణం కనిపిస్తోంది. రాత్రి వేళలో నగరంలో కుండపోతకు కారణాలేంటి.?ఏబిపి దేశంతో అధికారులు ఏం చెప్పారు?

Hyderabad Weather: హైదరాబాద్‌లో రాత్రి అయితే చాలు వర్షం కుమ్మేస్తోంది. తెల్లారేసరికి లోతట్టు ప్రాంతాలు జలమం అయిపోతున్నాయి. అర్థరాత్రివేళ అధికారులు రోడ్లపై పడి వాటర్ క్లియర్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిపై ఏపీబీ దేశం వాతావరణ శాఖాధికారులను సంప్రదించింది.
ఏబిపి దేశం: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం ఎలా ఉంది.? ఏయే జిల్లాలలో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి?
ధర్మరాజు, వాతావరణశాఖ సైంటిస్ట్: ఈనెల 13వ తేది నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్‌లో మొదలైన నైరుతీ రుతుపవనాలు మొదట్లో ఆశాజనకంగా కనిపించలేదు. తక్కువ వర్షపాత జూన్‌లో నమోదైంది. జులై వచ్చేసరికి 23శాతం ఉన్న వర్షపాతం లోటు క్రమేపీ భర్తీ చేస్తూ ఆగష్టు వచ్చేసరికి 5శాతం లోటకు చేరుకుంది. తాజాగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో 5శాతం లోటుభర్తీ కావడంతోపాటు సగటున 17శాతం అధిక వర్షపాతం నమోదైంది. 13వ తేదీ మేడ్చల్, మల్కాజిగిరి, భీమిలిలో 23శాతం నమోదైంది. జైశంకర్ భూపాలపల్లిలో 17 సెంటిమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇలా 13వ తేదీన తెలంగాణలో 50 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. 15వ తేదీ నాగర్ కర్నూల్‌లో 20 సెంటిమీటర్లు, వికారాబాద్‌లో 15 సెంటిమీటర్లు, ములుగులో 20 సెంటిమీటర్లు నమోదైంది. ఇలా వర్షపాత తీవ్రత పెరుగుతూ ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 150 చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి.
ఏబిపి దేశం: తెలంగాణ వ్యాప్తంగా అధిక వర్షపాతం ఆదిలాబాద్, ములుగు వంటి ప్రాంతాల్లోనే నమోదవుతుంది. అత్యధిక వర్షపాతం నమోదు అవ్వడానికి కారణాలేంటి?
ధర్మరాజు, వాతావరణ శాఖ సైంటిస్ట్: అత్యధిక వర్షపాతం నమోదవుతున్న జిల్లాల్లో భౌగోళిక పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. ఆదిలాబాద్ లో సారవంతమైన భూమితోపాటు, కృష్ణా, గోదావరి జలాలు జిల్లాను ఆనుకుని ప్రవహించడం కూడా అధిక వర్షపాతానికి కారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోనే అత్యధిక వర్షపాతం ఎక్కువగా నమోదు అవ్వడానికి కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులుగా చెప్పవచ్చు. నైరుతి రుతుపనాలపై ప్రభావం చూపించే అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనే ఉండటంతో ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావం కూడా ఉత్తర తెలంగాణపైనే ఎక్కువగా కనిపించడం కూడా అధిక వర్షపాతానికి మరో కారణంగా చెప్పవచ్చు. తూర్పు ,ఉత్తర తెలంగాణలో ఒకే రకమైన నైరుతీ రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఉండటంతో ఈనెల 13వ తేది నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఏ సీజన్‌లోనైనా ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. వేసవిలో కూడా ఎండల తీవ్రత ఈ ప్రాంతంలోనే అధికంగా ఉంటుంది. కొండలు, వాగులు , నదులు, ఇలా భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉండటం కూడా వర్షపాతం ఈ స్థాయిలో నమోదు కావడానికి మరో కారణంగా చెప్పవచ్చు.
ఏబిపి దేశం: గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో వింత వాతావరణ మార్పులు కనిపించాయి. పగలంతా ఆశించిన స్థాయిలో వర్షం లేనప్పటికీ, రాత్రి అయితే చాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు నగర వ్యాప్తంగా నమోదయ్యాయి. ఎందుకు ఇలా నగరంలో రాత్రి సమయంలో భారీ వర్షాలకు కారణాలేంటి.?
ధర్మరాజు, వాతావరణ శాఖ సైంటిస్ట్: హైదారాబాద్ నగరంలో వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఉష్ణోగ్రతల్లో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. సాధారణంగా భూమి ఉపరితలం వాతావరణం వేడిగా ఉంటుందో, తేమతో కూడిన గాలులు భూమి ఉపరితలంపైకి చేరినప్పుడే క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. డెక్కన్ పీఠభూమి కావడంతో హైదారాబాద్ నగరంలో క్యుములో నింబస్ మేఘాలు ఎక్కువ ఎత్తుకు ఎగిరే అవకాశం లేనప్పుడు మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. అటువంటి పరిస్థితులు ఎక్కువగా నగరంలో రాత్రి సమయంలోనే ఉంటున్నాయి. అందుకే రాత్రిళ్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత పదేళ్లుగా ఇలాంటి మార్పులు నెమ్మదిగా హైదరాబాద్ నగరంలో కనిపిస్తూ వస్తున్నాయి. జనసాంద్రత లెక్కకు మించి పెరగడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు.





















