Secunderabad Fire Accident : సికింద్రాబాద్ మరో అగ్నిప్రమాదం, హోటల్ పై భాగంలో ఎగసిపడిన మంటలు
Secunderabad Fire Accident : వరుస అగ్నిప్రమాదాలతో సికింద్రాబాద్ వాసులు హడలెత్తిపోతున్నారు. తాజాగా రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న తులిఫ్ హోటల్ పై భాగంలో మంటలు ఎగసిపడ్డాయి.
Secunderabad Fire Accident : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. భవనం పైన మంటలు ఎగసిపడ్డాయి. సికింద్రాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ తులిఫ్ పైన స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటలను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కరంట్ వైర్ తెగి రేకుల షెడ్ పై పడిపోవడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే మంటలు అదుపులోకి వచ్చాయి.
టెంట్ హౌస్ గోదాంలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ దబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అజంపురా వంతెన వద్ద టెంటౌజ్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపుచేసేందుకు ఫైర్ ఇబ్బంది ప్రయత్నించారు. ఎంత సేపటికి మంటలు అదుపులోకి రాలేదు.
ఇటీవల రాంగోపాల్ పేట్ లో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్‌లో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంగోపాల్‌పేట్ లోని డెక్కన్ నైట్ వేర్ కార్ల విడి భాగాల షాపులో ఈ ఘటన జరిగింది. మంటలు తీవ్ర స్థాయిలో చెలరేగి షాపులోని వస్తువులు మొత్తం దహించుకుపోయాయి. మంటల కన్నా పొగ అధికంగా రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అదే భవనంలోని పై అంతస్తులో బట్టలు షాపు ఉండడంతో అక్కడికి కూడా మంటలు వ్యాపించాయి. పొగ వ్యాపించిన కారణంగా అగ్ని మాపక సిబ్బంది పై ఫ్లోర్‌లకి వెళ్లడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పై అంతస్తుల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అగ్ని మాపక సిబ్బంది క్రేన్లను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు.
సికింద్రాబాద్ లో ఇటీవల ఘోర అగ్ని ప్రమాదం
గత ఏడాది సెప్టెంబర్ లో సికింద్రాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి కింద ఉన్న ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. బైక్ షోరూమ్ లో ఏర్పడిన మంటలు పైన ఉన్న రూబీ లాడ్జిపైకి ఎగిసి పడ్డాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి లాడ్జిలో ఉన్నవారు చనిపోయినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. పొగ వ్యాపించడంతో ఊపిరాడక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. రూబీ హోటల్ లో మొత్తం నాలుగు ఫోర్లలో 23 రూమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి రెండు ఫోర్లలోని వారు చనిపోయారని పోలీసులు తెలిపారు. మంటలు వ్యాపించినట్లు హోటల్ పై నుంచి దూకిన వారెవరూ చనిపోలేదని చెప్పారు.
నూతన సచివాలయంలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ నూతన సచివాలయంలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో సచివాలయం ప్రధాన గుమ్మం దగ్గర దట్టంగా పొగలు అలముకున్నాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 అగ్ని మాపక యంత్రాలతో రంగంలోకి దిగి మంటలు అదుపుచేశారు.