Saleshwaram Fair: సలేశ్వరం జాతరలో అపశ్రుతి - రద్దీతో ఊపిరాడక ముగ్గురు భక్తుల మృతి
Saleswaram Jathara in Nagarkurnool District: సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జాతరకు భక్తులు భారీగా పోటెత్తడంతో ఊపిరి ఆడక ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Saleswaram Jathara in Nallamala: తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జాతరకు భక్తులు పోటెత్తడంతో ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన 55 ఏళ్ల గొడుగు చంద్రయ్య గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. వనపర్తి పట్టణానికి చెందిన 32 ఏళ్ల అభిషేక్, ఆమన్ గల్ కు చెందిన 40 ఏళ్ల వయసు కల్గిన విజయలు ఊపిరి ఆడక చనిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొందరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పోలీసులు, బంధువులు తరలించారు.
మూడ్రోజుల పాటే సలేశ్వరం జాతర - విపరీతంగా పోటెత్తిన భక్తులు
నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరం జాతరకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ క్రమంలోనే సలేశ్వరం ఆలయానికి వెళ్లే దారి అంకా భక్తులతో నిండిపోయింది. అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా చాలా సేపు వేచి చూడాల్సి వస్తుంది. అలాగే మన్ననూర్ నుంచి సలేశ్వరం జాతరకు వచ్చే మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. అయితే సలేశ్వరం జాతరను గతంలో వారం రోజుల నుంచి పది రోజుల పాటు నిర్వహించేవారు.
ఈ ఏడాది మాత్రం మూడ్రోజుల పాటే నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విపరీతంగా జనాలు రావడంతో పరిస్థితి పూర్తి చేజారిపోయింది. ఎవరికి నచ్చినట్లుగా వారు తోసుకుంటూ వస్తుండడంతో... పలువురు చనిపోయారు. మరికొందరికి గాయాలు అయ్యాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరంలో లింగమయ్య దేవుడు కొలువై ఉన్నాడు. అయితే ఈ స్వామి వారిని దర్శించుకోవాలంటే దట్టమైన అడవి, కొండలు, కోనలు, లోయల మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. మార్గ మధ్యంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 5 కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లాలి. ఉగాది తర్వాత తొలి పౌర్ణమికి ఈ సలేశ్వరం జాతర మొదలు అవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈ ఏడాది సలేశ్వరం ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభం కాగా.. 7వ తేదీన ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే భక్తులను అడవిలోకి అనుమతిస్తున్నారు. రేపటితో ఈ జాతర పూర్తి కానుంది.