Revanth Meets Modi: రైజింగ్ సమ్మిట్‌కు రండి..వరాలు ప్రకటించండి - ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ఆహ్వానం
CM Revanth:ప్రధానమంత్రి మోదీతో రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు హాజరు కావాలని ఆహ్వానించారు.

Revanth met with Prime Minister Modi: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పార్లమెంట్లో ప్రధానితో జరిగిన ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం ప్రధానికి అందించారు.
కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా .. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ ను గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నట్లు సీఎం ప్రధానికి వివరించారు.
తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్ ఆమోదంతో పాటు ఫైనాన్సియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారిని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
— Telangana CMO (@TelanganaCMO) December 3, 2025
✅ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి… pic.twitter.com/yA8sJMRAf1
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఫోర్ లేన్ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని సీఎం ప్రధానికి వినతిపత్రం అందించారు.





















