Minsiter Errabelli : బీఆర్ఎస్ నేత కన్నుమూత, పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి
Minsiter Errabelli : వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండె రామస్వామి హర్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. రామస్వామి మరణ వార్త తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
![Minsiter Errabelli : బీఆర్ఎస్ నేత కన్నుమూత, పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి Palakurthi Minister Errabelli Dayakar rao participated in BRS Leader final rites Minsiter Errabelli : బీఆర్ఎస్ నేత కన్నుమూత, పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/06/ae8c5b9035aeff6f84f2c16a3daf48a71675691584941235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minsiter Errabelli : వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొండూరుకు చెందిన బీఆర్ఎస్ నేత గుండె రామస్వామి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. పాడేమోసిన ఆయన... రామస్వామితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండె రామస్వామి సోమవారం ఉదయం గుండె పోటుతో మరణించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ నుంచి కొండూరు చేరుకున్నారు. కొండూరులో రామస్వామి అంతిమ యాత్రలో పాల్గొని పాడే మోశారు. రామస్వామితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కంటతడి పెట్టుకున్నారు. రామస్వామి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. రామస్వామి కొడుకు తొర్రూరు మున్సిపాలిటీ మాజీ కమిషనర్ గుండె బాబును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుండె రామస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
బడ్జెట్ లో కేటాయింపులపై మంత్రి ఎర్రబెల్లి హర్షం
ఈ ఏడాది 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ లో 31,426 కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్ శాఖకు కేటాయించడంపై పట్ల సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టిందని, ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని మంత్రి అభివర్ణించారు. అదే విధంగా ఆసరా పెన్షన్లకు 12 వేల కోట్ల రూపాయలు, మిషన్ భగీరథకు రూ.600 కోట్లు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహాత్మా గాంధీ చెప్పిన పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్న మాటలను ఆచరణలో అమలు చేస్తూ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పల్లె ప్రగతి చేపట్టి తెలంగాణ పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, స్వయం సమృద్ధిగా తయారు చేశారన్నారు. దేశానికి తెలంగాణ పల్లెలు రోల్ మోడల్ గా మారాయని, అభివృద్ధిలో అందరితో పోటీ పడి మొదటి స్థానంలో నిలుస్తున్నాయన్నారు. జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొంది తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తం చేశాయన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో 13 జాతీయ అవార్డులు సాధించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.
పంచాయతీ రాజ్ శాఖకు ఎక్కువ నిధులు
హరిత హారంలో భాగంగా 710 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నర్సరీలు ఏర్పాటు చేశామన్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. 238 కోట్ల రూపాయలతో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, 279 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డులు నిర్మించి చెత్త నుంచి డబ్బులు సంపాదిస్తున్నామన్నారు. 1330 కోట్ల రూపాయలతో వైకుంఠ ధామాలు నిర్మించి అంతిమ సంస్కారాలు గౌరవంగా జరుపుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ విధంగా దాదాపు 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి 5 విడతల పల్లె ప్రగతిని విజయవంతంగా, రాష్ట్రం గర్వించేలా నిర్వహించామన్నారు. 4209 కోట్ల రూపాయలతో 8160 కిలో మీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను చేపట్టి రవాణా వ్యవస్థను గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ పాత రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం బడ్జెట్లో రూ.2 వేల కోట్లు ప్రతిపాదించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పథకాలు మరింత గొప్పగా నిర్వహించేందుకు ఈ బడ్జెట్లో అత్యధిక నిధులు రూ.31,426 కోట్లు కేటాయించి, 12 వేల కోట్లు ఆసరాకు ఇచ్చి, రూ.600 కోట్లు మిషన్ భగీరథకు కేటాయించడం ద్వారా తన శాఖలకు బడ్జెట్లో రూ.44,026 కోట్ల రూపాయలను ప్రతిపాదించారన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)