Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం, ఎద్దుపై దాడితో స్థానికుల్లో టెన్షన్ టెన్షన్
Telangana News | బోథ్ మండలంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపై అకస్మాత్తుగా పులి కనిపించింది.
Tiger wandering in Adilabad District | ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల పరిధిలోని వజ్జర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న మంగళవారం మధ్యాహ్నం వజ్జర్ అటవీ ప్రాంతం వైపు వెళుతున్న అటవీ శాఖ అధికారులకు రోడ్డుపై నుండి పులి వెళుతుండగా అకస్మాత్తుగా పులి కనిపించింది. నిన్నటి నుండి అటవీశాఖ అధికారులు పులి సంచారం పై సమీప గ్రామస్తులకు సమాచారం చేరవేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజాగా బుధవారం సాయంత్రం వేళలో బోథ్ మండలంలోని చింతగూడ, బాబేరతండా సమీపంలో పులి సంచరించింది. రైతు చూస్తుండగానే ఎద్దుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ప్రత్యక్ష సాక్షి, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని బాబేరతండా గ్రామానికి చెందిన రైతు జాదవ్ దిలీప్ రేండ్లపండ్లి గ్రామంలో ఉన్న తన పొలంలో ఎడ్లను మేపుతున్నాడు. ఆయన చూస్తుండగానే ఒక్కసారిగా పెద్దపులి ఎద్దుపై దాడి చేసింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన రైతు హుటాహుటిన పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చి ఈ విషయం గ్రామస్తులకు చెప్పాడు. దాంతో గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చి ఆ ప్రాంతంలో అలజడి సృష్టించడంతో పులి వెనుతిరిగింది.
పెద్దపులి వచ్చిందన్న సమాచారం తెలియడంతో చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి భింపూర్, తలమడుగు,బార్డర్ మీదుగా మహారాష్ట్రలోని కిన్వట్ వెనుకవైపు నుంచి బోథ్ మండలంలోని వజ్జర్ అటవీ ప్రాంతంలోకి సంచరించినట్లు చెబుతున్నారు. ఇది ఆడ పులి అని పలువురు చెబుతున్నారు. నిన్నటి నుండి వజ్జర్ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు సైతం గుర్తించారు. అటవీ అధికారులకే పులి కనిపించడంతో ముందస్తుగా అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూలీలు అప్రమత్తంగా ఉండాలని, పంట పొలాల్లో అడవిపందులకు అమర్చే విద్యుత్ తీగలను తొలగించాలని, పులికి ఎవరు హాని చేయకూడదన్నారు.
పులి సంచారం గురించి ఏబీపీ దేశం బోథ్ రేంజ్ అధికారి పుండలిక్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా... ఐదు బృందాలతో ట్రాక్ చేస్తున్నట్లు రేంజ్ అధికారి పుండలిక్ ఏబీపీతో తెలిపారు. పులి సంచారం వాస్తవమేనని, సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులిపాద ముద్రలు సేకరించి రేపు పూర్తి సమాచారం చేరవేస్తామన్నారు.