Nizamabad News: గంజాయి స్మగ్లింగ్, చోరీ నియంత్రణే నిజామాబాద్ జిల్లా పోలీసులకు పెద్ద టాస్క్
నిజామాబాద్ జిల్లాలో క్రైం ఆగేదెలా.. కమిషనరేట్ పరిధిలో నిఘా ఎంత. దొంగతనాలు, దొమ్మిలు ఎన్ని ట్రేస్ అయ్యాయ్. ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయ్. నేరాలు ఆగలేదు, ఘోరాలు తగ్గలేదు. సీసీ కెమెరాల పరిస్థితి ఎంటీ.
ప్రజలు, పోలీసుల సమన్వయంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని నిజామాబాద్ కమిషనరేట్ కు కొత్తగా వచ్చిన సీపీ కె.ఆర్. నాగరాజు అన్నారు. 2021లో పలు కేసులు గణనీయంగా తగ్గాయని, 2022లో ఇతర నేరాలన్నింటిని కూడా తగ్గించేలా చర్యలు చేపడతామని చెప్పారు. 2021 వార్షిక నేరాల జాబితాను విడుదల చేశారు. అయితే 2021 ఏడాది లో చూసినట్లైతే పోలీసులు నేరాలు తగ్గాయనే చెబుతున్నా.... ఉమ్మడి జిల్లాలో మహిళలను అత్యాచారం చేసి దారుణంగా హత్యలు చేసిన ఘటనలు వెలుగు చూశాయ్. ఏడాది చివరిలో డిచ్ పల్లిలో ముగ్గురి దారుణ హత్య జిల్లాలో కలకలం రేపింది. దొంగతనాలకు లెక్కే లేకుండా పోయింది. ఏడాది పోడవునా జరిగిన దొంగతనాల్లో ట్రేస్ చేసిన సంఖ్య తక్కువే.... ప్రజా భద్రతా విషయంలో పోలీసులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. జాతీయ రహదారులపై ఏటీఎంల చోరీల కేసును ఇంకా పోలీసులు ఛేదిచలేదు. గంజాయ్ స్మగ్లింగ్ కు నిజామాబాద్ నగరం అడ్డాగా మారింది. ఇంకా గుట్టుచప్పుడు కాకుండా గంజాయ్ స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. దీంతో యువత గాడి తప్పుతున్నారనే వాదనలు ఉన్నాయ్. కొత్త ఏడాది నుంచైనా మాదక ద్రవ్యాల కట్టడికి పోలీసులు మరిన్ని చర్యలు తీసుకోవాలంటున్నారు జిల్లా వాసులు.
జిల్లాలో 622 అదృశ్య కేసులు నమోదయ్యాయి. 509 మందిని గుర్తించగా మరో 113 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. 18 ఏళ్లలోపు పిల్లలు అదృశ్యమైన కేసులు 98 నమోదు కాగా వీరిలో 9 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో 1,988 సీసీ కెమెరాలు ఉన్నాయ్. ఇందులో కమ్యూనిటీ ప్రాంతాల్లో 752, నేనుసైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 1,236 ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు పనిచేయని కెమెరాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. నేటి కాలంలో చాలా కేసులు సీసీ కెమెరాల ద్వారానే ట్రేస్ అవుతున్నాయ్. నగరం రోజు రోజుకూ విస్తరిస్తోంది. అందుకు తగ్గట్లు నేరాలు కూడా పెరుగుతున్నాయ్. ఈ నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలంటే సీసీ కెమెరాల ఏర్పాటు విస్తృతం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. నగరంలో రాత్రి వేళల్లో కొన్ని హోటళ్లకు సమయపాలన లేకుండా పోయింది. నిజామాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వెళ్లని పరిస్థితి. రాత్రుల్లో పవన్ థియేటర్ నుంచి సారంగపూర్ వరకు హోటళ్లు, సయమం మించిన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయ్. కచ్చితంగా సమయపాలన విధించాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. లేదంటే రాత్రుల్లో నేరాలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదు. శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ మరింత పెంచాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది నుంచైనా శాంతి భద్రతల విషయంలో పోలీసులు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఈ చలనాల పేరుతో 16 కోట్ల రూపాయలు జనం నుంచి వసూల్ చేశారు. ఈ ఏడాది రూ.16.71 కోట్ల జరిమానాలు విధించారు. నిజామాబాద్ నగరంలోనే అత్యధికంగా రూ.10 కోట్ల జరిమానాలు వేశారు. మొత్తం 4,64,927 ఈ-చలానాలు జారీ అయ్యాయి. ఇందులో పక్కాగా వ్యవహరిస్తున్న పోలీస్ శాఖ ప్రజా భద్రతపైనా ఆ స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు జిల్లా వాసులు.
Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి