ఒకప్పుడు కంచు కోటగా ఉన్న ఆర్మూర్‌లో కాంగ్రెస్‌కు అభ్యర్థి కరవు ?
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. నేడు అభ్యర్థి కరువు. నియోజకవర్గం ఏర్పాటు తర్వత 14 సార్లు జరిగిన ఎన్నికల్లో 8 సార్లు కాంగ్రెస్ గెలుపు. అరువు అభ్యర్థి కోసం పాట్లు.
నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర, దేశ స్థాయిలో చక్రం తిప్పిన నేతలు ఉన్నారు. అలాంటిది ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో హస్తం పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే నాయకుడే కరవయ్యారు. మారిన రాజకీయాలకు అనుగుణంగా కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకున్న ఆర్మూర్ కోటను బద్ధలు కొట్టేసింది టీఆర్ఎస్. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి శనిగరం సంతోష్ రెడ్డి నాటి బలమైన కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి గులాబీ పార్టీ సత్తా చాటారు. 2009లో టీడీపీ నుంచి అన్నపూర్ణమ్మ గెలిచారు. 2014, 2019 వరుసగా రెండు సార్లు మళ్లీ టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గాన్ని క్యాప్చర్ చేసింది.
ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పడ్డాక 1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టి. అంజయ్య 15,454 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు తర్వాత మొత్తం 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా అందులో 8 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. 3సార్లు టీడీపీ, 3 సార్లు టీఆర్ఎస్ గెలిచింది. ఈ నియోజకవర్గం నుంచి రాజకీయ ఉద్దండులు ఎమ్మెల్యేలుగా అయ్యారు. టి. అంజయ్య మొదలుకుని తుమ్మల రంగారెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి, ఏలేటీ మహిపాల్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే ఆశన్నగారి జీవన్ రెడ్డి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న ఆకుల లలిత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆమె టీఆర్ఎస్ కు సరెండర్ అయ్యారు. అయినా కాంగ్రెస్ గుర్తు మీద భారీగానే ఓట్లు పడ్డాయ్.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే నాయకుడు కరవయ్యాడు. 2014 ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనే ఇచ్చింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాగేయటంతో... ఇతర సెకండ్ క్యాడర్ లీడర్లను గులాబీ గూటికి చేర్పించుకోవటంతో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గంలో బలహీనపడుతూ వచ్సింది. గతంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి బాల్కోండను కాదని ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే సురేష్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ఆర్మూర్ నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉండేవారు. ఆర్మూర్ కాంగ్రెస్ క్యాడర్ ను ఆయన కాపాడుకుంటూ వచ్చారు. సురేష్ రెడ్డి సైతం కారు పార్టీలో చేరటంతో ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనాథగా మారిందంటున్నారు లోకల్ లీడర్లు. మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఆర్మూర్ నియోజకవర్గంలో గెలవాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం బలమైన లీడర్ ఎంతైనా అవసరం. ఇప్పుడున్న సిచ్యూయేషన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆర్మూర్‌లో లీడరే దొరకటం లేదన్న వాదన వినిపిస్తోంది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారమైతే జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్ గతంలో నిజామాబాద్ అర్బన్, రూరల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఈసారి ఆర్మూర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతారా లేక కొత్త అభ్యర్థిని అక్కడ ప్రమోట్ చేస్తారా అన్నదానిపై ఇంకా కాంగ్రెస్ వర్గాల్లో క్లారిటీ కనిపించటం లేదు.
ఆర్మూర్ నుంచి అరువు నేతలే పోటీకి సై....
కాంగ్రెస్ పార్టీ నుంచే కాదు ఇతర పార్టీలో కూడా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి అరువు తెచ్చుకున్న లీడర్లే గెలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయ్. అరువు నేతలను ఆర్మూర్ ప్రజలు గెలిపించుకున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తి చూపిస్తే అతని టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ అది వర్కౌట్ అవుతుందా అన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడినట్లు తేెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి ఆ సమయానికి ఎవరైనా బలమైన లీడర్ కాంగ్రెస్ వైపు చూడకపోరా అన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం శ్రమించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందా అన్నది చూడాలి మరి.