Dalitha Bandhu: తెలంగాణలో ‘దళిత బంధు’ పేరుకు అడ్డంకి.. ఎస్సీ కమిషన్ అభ్యంతరం.. నోటీసులు
‘దళిత’ అనే పదానికి ‘తక్కువగా చూపునకు గురయ్యేవారు’, ‘అంటరానివారు’, ‘నిస్సహాయులు’ అనే అర్ధాలు ఉత్పన్నమవుతున్నాయని బత్తుల రామ్ ప్రసాద్ పిటిషన్‌లో వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత హడావుడిగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం పేరు విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నేషనల్ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మాల సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ పిటిషన్ దాఖలు చేయగా.. ఎస్సీ కమిషన్ కూడా దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘దళిత’ స్థానంలో ‘అంబేడ్కర్’ అనే పదాన్ని వాడాలని మాల సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ కోరారు.
‘దళిత’ అనే పదానికి ‘తక్కువ చూపునకు గురయ్యేవారు’, ‘అంటరానివారు’, ‘నిస్సహాయులు’ అనే అర్ధాలు ఉత్పన్నం అవువుతున్నాయని బత్తుల రామ్ ప్రసాద్ తన పిటిషన్‌లో వివరించారు. ఇందులో భాగంగా జాతీయ ఎస్సీ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నోటిసులిచ్చింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది.
వాసాలమర్రిలో దళిత బంధు అమలు
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఆగస్టు 4న బుధవారం సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో పర్యటించి అనూహ్యంగా సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్రామంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల నగదు రేపే విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. దళిత బంధు ప్రారంభించ తలపెట్టిన ఆగస్టు 16 కన్నా ముందే కేసీఆర్ దీన్ని అమలు చేసేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేసీఆర్ ఇచ్చిన ఆ మాట ప్రకారం ప్రభుత్వం ఇవాళ (ఆగస్టు 5న) దళిత బంధు పథకాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు రూ.7.6 కోట్ల విడుదలకు అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జారీ చేశారు. రూ.7.6 కోట్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఆదేశాలు జారీ చేశారు.
రూ.7.6 కోట్లు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున బ్యాంకులో జమ కానున్నాయి. ఆ డబ్బుతో లబ్ధిదారుల కుటుంబాల వారు మెరుగైన ఉపాధి కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సుమారు 3 గంటలపాటు పర్యటించిన సంగతి తెలిసిందే. వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.