Revanth Reddy on SLBC Project: ఎస్‌ఎల్‌బీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి డెడ్‌లైన్
Telangana CM Revanth Reddy | శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులను వెంటనే ప్రారంభించాలని, 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

SLBC Project | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా తక్షణం ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబర్ 9 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించడమే కాక, రాష్ట్రానికి దీర్ఘకాలిక నీటి సరఫరాలో కీలకపాత్ర పోషించే ఈ ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతికతతో, ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా, పనులు భద్రంగా కొనసాగేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం భారత సైన్యంలో అనుభవం ఉన్న ఇంజినీరింగ్ నిపుణుల సేవలు వినియోగించాలని నిర్ణయించారు.
అధికారులు, నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, మాజీ ఆర్మీ ఇంజనీర్ ఇన్‌చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్, ఇతర నిపుణులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో ఎన్జీఆర్ఐ, జీయోలాజికల్ సర్వే వంటి సంస్థల నిపుణుల సహకారంతో యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఆదర్శ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి
దేశ, విదేశాల్లో చేపట్టే టన్నెల్ ప్రాజెక్టులకు ఎస్‌ఎల్‌బీసీ ఆదర్శంగా నిలిచేలా నిర్మాణం జరగాలని సీఎం ఆకాంక్షించారు. ఇది ఒక కేస్ స్టడీగా ఉపయోగపడేలా ప్రభుత్వం అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. అటవీ శాఖ, ఇంధన శాఖ, నీటిపారుదల శాఖలతో తక్షణమే సమన్వయం కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 15లోగా కేబినెట్ సమావేశం నిర్వహించి, అవసరమైన అనుమతులు, నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. పనులు అడ్డంకులు లేకుండా కొనసాగేందుకు ఒకే సమావేశంలో సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని చెప్పారు.
టన్నెల్ పనులు వేగవంతం
ప్రస్తుతం 44 కిలోమీటర్ల టన్నెల్‌లో 35 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయని, మిగిలిన 9 కిలోమీటర్ల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెల కనీసం 178 మీటర్ల తవ్వకాలు పూర్తి చేస్తూ జనవరి 2028 నాటికి మొత్తం టన్నెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టన్నెల్ తవ్వకాలలో ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు హెలీ-బోర్న్ సర్వే నిర్వహించాలని నిర్ణయించబడింది. దీనిని ఎన్జీఆర్ఐ ద్వారా చేపట్టనున్నారు.
కాంట్రాక్టు సంస్థలకు స్పష్టమైన హెచ్చరిక
జేపి అసోసియేట్స్ సంస్థ టన్నెల్ పనులకు అవసరమైన అన్ని పరికరాలు సిద్ధం చేసుకోవాలని, ఒక్క రోజు ఆలస్యం జరిగినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఇన్లెట్, ఔట్లెట్ రెండు వైపుల నుంచి సమాంతరంగా పనులు జరగాలని, అవసరమైన నిపుణులు, కార్మికులు, యంత్రాలు రంగంలోకి దిగాలని ఆదేశించారు.
గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల
ప్రాజెక్ట్ పనులకు నిధుల కొరత కలగకుండా, ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ గ్రావిటీ ఆధారంగా నీటి పంపిణీ చేయగల సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ అని పేర్కొంటూ, ఇది ప్రజల కలల ప్రాజెక్ట్‌గా వర్ణించారు.
SLBC తుది గడువు: డిసెంబర్ 9, 2027
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ గడువు విధించారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా ప్రతి 3 నెలలకోసారి ప్రణాళిక రూపొందించాలనీ అధికారులకు ఆయన సూచించారు. కాగా, కొన్ని నెలల కిందట ఎస్‌ఎల్‌బీసీలో జరిగిన ప్రమాదలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో కేవలం ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు, ఇతర విభాగాలు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి బాగోలేదని పనులు మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.






















