Gutha Sukender Reddy: కోమటిరెడ్డి సోదరులది పొలిటికల్ సూసైడ్, మునుగోడు ఎన్నికతో వారికి తీవ్ర నష్టం: గుత్తా సుఖేందర్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికతో రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా నష్టపోయారని శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి చెప్పారు. బీజేపీ నేతలపై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాకిచ్చాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. బై ఎలక్షన్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ సూసైడ్ చేసుకున్న వారితో సమానం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతుండగా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి తప్ప ఏమీ సాధించలేదన్నారు. మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి బ్రదర్స్ కు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికతో సోదరులిద్దరూ రాజకీయంగా చాలా నష్ట పోయారని వ్యాఖ్యానించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికతో రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా నష్టపోయారని చెప్పారు. బీజేపీ నేతలపై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. మతోన్మాద శక్తులకు మునుగోడు ప్రజల తీర్పు చెంపపెట్టు అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు ఓటర్లు జై కొట్టారని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నిరంకువ విధానాల్ని తిప్పి కొట్టేందుకు టీఆర్ఎస్ పక్షాన మునుగోడు ప్రజలు నిలిచారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. స్వప్రయోజనాల కోసం ఎన్నికలు తెచ్చిన కోమటిరెడ్డి బ్రదర్స్ కు రాజకీయంగా నష్టమే కానీ, ప్రయోజనం కలగలేదని అభిప్రాయపడ్డారు.