Revanth Reddy : చిప్పకూడు సాక్షిగా చెబుతున్నా, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా- రేవంత్ రెడ్డి
Revanth Reddy : పేదల పక్షాన కొట్టాడి జైలుకెళ్లానని, ఒక్కసారి కాదు పేదల కోసం 100 సార్లు జైలు కెళ్తానన్నారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy : దేశంలోనే మొట్టమొదటి గురుకుల పాఠశాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆశావహులు పార్టీ మారతారని గోతికాడి నక్కల్లా బీజేపీ, టీఆర్ఎస్ ఎదురుచూశాయన్నారు. దేశంలో కాంగ్రెస్ పై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తనను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టారని రేవంత్ విమర్శించారు. తాను దొంగతనం చేసి జైలుకు పోలేదన్నారు. పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లానన్నారు. తాను జైలుకెళ్లానని గర్వంగా చెబుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కసారి కాదు పేదల కోసం 100 సార్లు జైలుకెళ్తానన్నారు. తాను తిన్న చిప్పకూడు సాక్షిగా చెబుతున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానన్నారు.
చంటి పిల్లల పాలపై జీఎస్టీ వేసిన ఘనత బీజేపీది
"కాంగ్రెస్ గిరిజనులకు పట్టాలిస్తే కేసీఆర్ ఆ భూములు గుంజుకున్నారు. ఇక్కడి గ్రామాలకు సరైన రోడ్లు వేయనివారు ఇక్కడ అభివృద్ధి చేస్తారా? మునుగోడుతో మాకు ఎంతో అనుబంధం ఉంది. దివంగత జైపాల్ రెడ్డి అమ్మమ్మ ఊరు ఇది. కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్ ఎన్నికల కోసం వాళ్ల కాళ్లు పట్టుకున్నారు. ఈ ప్రాంతానికి ఏం చేయని వారికి ఓట్లు అడిగే హక్కు లేదు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచినందుకు బీజేపీకి ఓటేయలా?. చంటిపిల్లల పాలపై కూడా జీఎస్టీ వేసిన ఘనులు బీజేపీ వాళ్లు. తెలంగాణ ఇచ్చినందుకు, గిరిజనులకు భూములు పంచినందుకు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ కు ఓటు వేయాలి. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన మాకే మునుగోడు ప్రజలను ఓటు అడిగే హక్కు ఉంది. నేను మీలో ఒకడిని నన్ను పీసీసీ అధ్యక్షుడిని చేసిన ఘనత కాగ్రెస్ పార్టీది." -రేవంత్ రెడ్డి
చిన్న పల్లె - పెద్ద అభిమానం…#ManaMunugodeManaCongress pic.twitter.com/xdv1ty4h8B
— Revanth Reddy (@revanth_anumula) September 23, 2022
మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా
పేదల నేస్తం కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న నమ్మకముందన్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తినన్నారు. కాంగ్రెస్ గౌరవాన్ని నిలబెడతానని చెప్పారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేస్తానని రేవంత్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి కోడలు
చంద్రబాబు మనిషి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్ మనిషేనన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి కోడలు లాంటి వాడినన్నారు. పుట్టిల్లు టీడీపీ అయినా మెట్టినిల్లు కాంగ్రెస్‌లోకి వచ్చానని రేవంత్ వెల్లడించారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే టీడీపీలోకి వెళ్లారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అప్పట్లో బిడ్డగా టీడీపీ గౌరవం నిలబెడితే ఇప్పుడు కోడలిగా కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నానన్నారు. మునుగోడు ఉపఎన్నికలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి మద్ధతుగా సంస్థాన్ నారాయణ పురం మండలంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Also Read : KTR Twitter: 'రూపాయి విలువ తగ్గిపోతుంటే, రేషన్ షాపులో మోదీ ఫొటో కోసం చూస్తున్నారా'