Kavitha Phone : ఇంటి నుంచి తెప్పించి మరీ కవిత ఫోన్ సీజ్ - సుదీర్ఘంగా కవితను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు !
ఎమ్మెల్సీ కవిత ఫోన్ ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. సుదీర్ఘంగా విచారణ సాగుతోంది.
Kavitha Phone : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఫోన్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం విచారణకు వచ్చేటప్పుడు కవిత పోన్ తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఫోన్ ఉంచి వచ్చారు. అయితే విచారణలో ఫోన్ గురించి ఈడీ అధికారులు వాకబు చేశారు. తన వద్ద లేదని చెప్పడంతో వెంటనే తెప్పించాలని ఆదేశించారు. ఈడీ కార్యాలయం బయట ఎదురు చూస్తున్న కవిత డ్రైవర్‌కు సమాచారం పంపి.. ఆయనను నివాసానికి వెళ్లి ఫోన్ తీసుకు రావాలని పురమాయించారు. మధ్యాహ్నం సమయంలో కవిత డ్రైవర్ ఫోన్ తీసుకుని ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారులకు ఇచ్చారు. ఆ ఫోన్ ను ఈడీ అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
కవితను ఉదయం పదకొండు గంటల నుంచి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలోని సహ నిందితులతో కలిసి కవితను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఇష్యూలో ప్రధానంగా నిందితులు ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. కవిత వాడిన 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారన్నని గతంలో ఈడీ కోర్టుకు తెలిపింది. అసలు కవిత వాడిన ఫోన్లు ఎన్ని..? ఎందుకు ధ్వంసం చేశారనేదానిపై ప్రధానంగా ఈడీ ఇప్పుడు విచారించినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్లపై ఈడీ ప్రశ్నలకు కవిత ఏమని సమాధానం చెప్పారనేది తెలియరాలేదు. ఇలా ఫోన్ల ధ్వంసం గురించి విచారణ అయ్యాకే అధికారులు కవిత ఫోన్‌ను ఇంటి నుంచి తెప్పించారని తెలుస్తోంది.
విచారణలో గంట పాటు ఈడీ అధికారులు కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. - ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో మహిళా అధికారి సమక్షంలో ఈ విచారణ మొత్తం అధికారులు వీడియో షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కవితతో పాటు మొత్తం 9 మందిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మనీష్ సిసోడియా (Manish Sisodia), కవిత, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌లను విడివిడిగా, కలిపి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇప్పటికే అరుణ్ పిళ్ళై, మనీష్ సిసోడియా ఈడీ కస్టడీలో ఉన్నారు.
ఢిల్లీలో ఈడీ ఆఫీసు వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు మోహరించి ఉన్నారు. కవితకు సంఘిభావంగా ... న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇతర సీనియర్ నేతలు.. బీఆర్ఎస్ న్యాయనిపుణులు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు.
కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ టు ఢిల్లీ భారీ నిరసనలు - పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్న బీఆర్ఎస్ !?