Kavitha News : కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ టు ఢిల్లీ భారీ నిరసనలు - పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్న బీఆర్ఎస్ !?
కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ, ఢిల్లీలో భారీ నిరసనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంది. ఢిల్లీ పరిణామాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
Kavitha News : భారత రాష్ట్ర సమితి నేతలంతా ఫుల్ అటెన్షన్‌లో ఉన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సహా అందరూ డిల్లీలోని ఈడీ కార్యాలయం వైపు చూస్తున్నారు. ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్న కవితను అరెస్ట్ చేస్తారా లేదా అన్న ఉత్కంఠతో వారు చేస్తున్నారు. అంతే కాదు ఒక వేళ అరెస్ట్ చేస్తే చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణను కూడా దాదాపుగా ఖరారు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వైపు నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం ఇటు తెలంగాణ నుంచి అటు ఢిల్లీ వరకు నిరసనలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
ఈడీ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేస్తారని నమ్ముతున్న బీఆర్ఎస్ నేతలు
కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. ఇప్పటి వరకూ సీబీఐ, ఈడీలు దాఖలు చేసిన చార్జిషీలు, రిమాండ్ రిపోర్టుల్లో మనీష్ సిసోడియాతో పాటు కవితను కూడా నిందితురాలిగా చెబుతున్నారు. ఆమె స్కాంలో కీలక నిందితురాలిగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు పిలవడంతో అరెస్ట్ ఖాయమని అంచనాకు వచ్చారు. మామూలుగా సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ జరుపుతుంది. సీబీఐ విచారణ విషయంలో అరెస్టు నుంచి ఏదో విధంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది కానీ..ఈడీ విషయంలో మాత్రం సాధ్యం కాదన్న అబిప్రాయం న్యాయనిపుణుల్లో ఉంది.
పెద్ద ఎత్తున ఆందోళనలకు బీఆర్ఎస్ నేతల ప్లాన్
ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం విషయంలో అవినీతి గురించి ఈడీ విచారణ జరపదు. ఈ స్కాంలో జరిగిన మనీలాండరింగ్ విషయంలోనే విచారణ జరుపుతుంది. పక్కా ఆధారాలు ఉండబట్టే ఈడీ ఇలా అరెస్టులు చేస్తుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి భార్య కనిక రెడ్డికి చెందిన ప్రైవేటు విమానాల ద్వారా నగదును సరఫరా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో రామచంద్ర పిళ్లై, సిసోడియా డబ్బులను ఎలా రూటింగ్ చేశారో ఇప్పటికే ఈడీ వెల్లడించింది. అందుకే ఈడీ విచారణ కీలకమని భావిస్తున్నారు. అరెస్ట్ చేసే ఉద్దేశం ఉండబట్టే ఆన్ లైన్ లేదా... ఇంటికి వచ్చి విచారణ జరిపే అవకాశాల్ని తోసి పుచ్చి.. ఈడీ కార్యాలయాలనికే రమ్మన్నారని భావిస్తున్నారు.
ప్రగతి భవన్ నుంచి ఢిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేసీఆర్
హైదరాబాద్ నుంచి ఢిల్లీ పరిణామాలను గమనిస్తున్నకేసీఆర్... పార్టీ ముఖ్య నేతలందరూ ఢిల్లీకి వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు ఢిల్లీలో ఉన్నారు. మిగతా మంత్రులు కీలక నేతలు కూడా ఢిల్లీకి చేరుకోబోతున్నారు. కవితను అరెస్ట్ చేస్తే.. డిల్లీలో వీరంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలోని ఈడీ ఆఫీసు ముందు కూడా పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. ముందు జాగ్రత్తగా సెక్యూరిటీ ఏర్పాట్లను చేశారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం గేటును మూసేశారు.