Uttam Kumar Reddy: మేడిగడ్డపై రివ్యూ- ఎల్ అండ్ టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
Medigadda Barrage: ఎల్ అండ్ టీ ప్రతినిధులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kaleshwaram Lift Irrigation Project: హైదరాబాద్: ఎల్ అండ్ టీ ప్రతినిధులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు, తదనాంతర పరిస్థితుల నుంచి తప్పించుకోవాలని చూడొద్దని ఎల్ అండ్ టీ ప్రతినిధులకు సూచించారు. సచివాలయంలో ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం ముగిసింది. మంత్రి ఉత్తమ్ తో ఎల్ అండ్ టి గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్ మరియు ప్రతినిధులు సమావేశం అయ్యారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నాసిరకంగా పనులు ఎలా చేశారని వారిని మంత్రి ప్రశ్నించారు. నాణ్యత లేకుండా భారీ ప్రాజెక్టు నిర్మాణాలు ఎలా చేశారంటూ ఎస్వీ దేశాయ్ ని, సంస్థ ప్రతినిధులను నిలదీశారు.
ప్రాజెక్టు నిర్వహణలో ఎక్కడో లోపం తలెత్తిందంటూ.. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లక్ష కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టును ఎందుకు పనికి రాకపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టేది లేదన్నారు. మేడిగడ్డ నిర్మాణం, ప్లానింగ్, బడ్జెట్, నిర్వహణ లాంటి పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదేనని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ లేఖ
Medigadda Barriage Damage: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు ఘటనకు సంబంధించి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని, దెబ్బతిన్న పిల్లర్లను పునరుద్ధరించే పని తమది కాదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే మరమ్మతులకు అయ్యే ఖర్చు చెల్లించాల్సి ఉంటుందని, అందుకోసం అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని స్పష్టం చేసింది. కాగా, బ్యారేజీ కుంగినప్పుడు మాత్రం నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు అధికారికంగా ప్రకటించారు. సదరు నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటించింది. తాజాగా, ఆ బాధ్యత తమది కాదంటూ కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వర్లుకి లేఖ రాసింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖను కింది స్థాయి ఇంజినీర్లకు పంపించారు.