Ponnam Prabhakar: 'బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని మరోసారి బయటపడింది' - బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్
Telangana News: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొంటారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని మరోసారి బయట పడిందన్నారు.
Minsiter Ponnam Coutner To Bandi Sanjay Comments: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ (KCR) కొనుగోలు చేస్తారని.. ప్రభుత్వం కూలిపోతుందన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు. బండి వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే విషయం మరోసారి బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరని.. ప్రభుత్వాన్ని కూలగొట్టే తెగువ బీఆర్ఎస్ కు లేదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రెండుగా చీలిపోతుందని అన్నారు. మంగళసూత్రాలు అమ్మిన సంజయ్ కు ఇప్పుడు లక్ష రూపాయలతో కటౌట్స్ పెట్టుకునే డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు.?. కరీంనగర్ పార్లమెంటుకు ఆయన తెచ్చిన నిధులు శూన్యమని విమర్శించారు. బీజేపీ నేతలు రాముడి కటౌట్లు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.
'కాంగ్రెస్ అలా చెప్పలేదు'
'శాస్త్రం ప్రకారం ప్రాణ ప్రతిష్ట పండితులు చేస్తారు. అయోధ్య దేవాలయం నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే అశాస్త్రీయంగా మందిర ప్రారంభం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామ మందిర ప్రారంభానికి పోవద్దని ఎక్కడా చెప్పలేదు. రాముడి పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేస్తోంది. రేషన్ బియ్యం తెచ్చి రాములోరి అక్షింతలంటున్నారు. ఎంపీగా బండి సంజయ్ కొండగట్టు, వేములవాడ కోసం నిధులు ఏమైనా తెచ్చారా.?' అంటూ పొన్నం నిలదీశారు. అవినీతి ఆరోపణలు రావడం వల్లే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు జ్యోతిష్యం చెప్పినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలి.? అని ప్రశ్నించారు. బండి సంజయ్, వినోద్ కుమార్ లకు కరీంనగర్ లో ఓట్లు అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో అవినీతి జరిగితే మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలపై విచారణ నడుస్తోందని.. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని అన్నారు.
'కేటీఆర్ అసహనంతో ఉన్నారు'
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నారని పొన్నం అన్నారు. 'సీఎం పదవి ఎడమ కాలు చెప్పుతో సమానం అని తండ్రి అంటే కొడుకు సీఎం పదవి కంటే కేసీఆర్ అనే పదం పవర్ ఫుల్ అని కేటీఆర్ అంటారు. ఇది ఒట్టి భ్రమ. అలాంటప్పుడు కేసీఆర్ పదానికి పూజ చేసుకోండి.' అని ఎద్దేవా చేశారు. జీవితంలో ఎప్పుడూ కూడా బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేయవని మంత్రి స్పష్టం చేశారు. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాతో పోటీ పడేది ఎవరో మిగిలిన పార్టీలే తేల్చుకోవాలని అన్నారు.
బండి సంజయ్ ఏమన్నారంటే.?
అంతకుముందు, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రణాళిక వేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని.. తన కుట్రలతో ఏమైనా చేస్తారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ నింద బీజేపీ మీద వేస్తారని విమర్శించారు. అందుకని ముందు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను బొంద పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే జనం నమ్మబోరని అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు మేం రెడీగా ఉన్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ అంటేనే పార్టీలను కూల్చేది.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ అని పేర్కొన్నారు.
Also Read: KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీ అప్పుడేనా? - తెలంగాణ భవన్ వేదికగానే కార్యకలాపాలు