KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీ అప్పుడేనా? - తెలంగాణ భవన్ వేదికగానే కార్యకలాపాలు
KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి నుంచి మళ్లీ జనంలోకి వస్తారని తెలుస్తోంది. ఆయన పుట్టిన రోజైన 17న రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.
KCR Re Entry May be On February 17th: తుంటి ఎముక సర్జరీతో కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటోన్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే నెల నుంచి పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ గా పాల్గొంటారని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మ స్థైర్యం నింపేలా జనంలోకి రావాలని ఆయన భావిస్తున్నారు. తన పుట్టినరోజైన ఫిబ్రవరి 17న మళ్లీ ప్రజల్లోకి రావాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఆ రోజే హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాలు, నేతలు, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
గజ్వేల్ కు అప్పుడేనా.?
గజ్వేల్ లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్.. వచ్చే నెల 20 తర్వాత నియోజకవర్గ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఇకపై రెగ్యులర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కేడర్ కు అందుబాటులో ఉండాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి పర్యటనలో నియోజకవర్గ ప్రజలకు.. తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలపడం సహా స్థానికంగా అభివృద్ధి పనులపైనా అధికారులతో చర్చించనున్నారని సమాచారం.
తెలంగాణ భవన్ లోనే
ఇక తెలంగాణ భవన్ వేదికగానే పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక్కడే లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, పార్టీ కార్యాలయంలోనే నాయకులు, కేడర్ తో వరుస భేటీలో నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాలపై ప్రణాళికలు రచించనున్నట్లు సమాచారం. ఈ నెల 22న పార్టీ లోక్ సభ సన్నాహక సమావేశాలు ముగియనుండగా.. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ ఇలానే మీటింగ్స్ జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అనేకమార్లు తేదీలు ప్రకటించినా.. అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
కోలుకుంటున్న కేసీఆర్
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో డిసెంబర్ 8న జారి పడిపోవడంతో తుంటి ఎముకకు గాయమైంది. అనంతరం ఆయన సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేరగా.. 9న తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఈ క్రమంలో ఆయన్ను ఆస్పత్రిలో సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖులు పరామర్శించారు. అనంతరం డిశ్చార్జి కాగా.. నందినగర్ లోని తన నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు పరిమిత సంఖ్యలోనే సన్నిహితులు, పార్టీ నేతలను కలుస్తున్నారు. మరో 3 నుంచి 4 వారాల్లో ఆయన పూర్తిగా కోలుకుని ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంటున్నాయి. అటు, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 3 నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ రీ ఎంట్రీ ఆయన పుట్టిన రోజున జరిగితే లోక్ సభ ఎన్నికల సమయంలో కేడర్ కు మరింత జోష్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.
భారీ ఏర్పాట్లు
మరోవైపు, ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. క్షేత్ర స్థాయిలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. జంట నగరాల్లో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు కట్టేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలిసారిగా జనంలోకి వస్తారని భావిస్తోన్న తరుణంలో ఆ మేరకు ఘన స్వాగతం పలికేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అటు, కేసీఆర్ ను స్వయంగా కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఇతర ముఖ్య నేతలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.