KTR On Kavitha: కుటుంబంలో అలుగుడు, గులుగుడు ఉంటది, ఏదైనా ఉంటే ఇంట్లో కొట్లాడాలి - కవిత కన్నీరుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
KTR: కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయని.. ఏదైనా ఉంటే ఇంట్లో అనుకోవాలి, కలిసి కొట్లాడాలని కేటీఆర్ అన్నారు. కవిత కన్నీరు తర్వాత జనగామలో కేటీఆర్ పరోక్షంగా స్పందించారు.

KTR s first reaction to Kavithas tears: "కుటుంబం అన్నాక సమస్యలు ఉండటం సహజమని, అక్కడక్కడ అలుగుడు, గులుగుడు లేకపోతే అది అసలు కుటుంబమే కాదని" కేటీఆర్ వ్యాఖ్యానించారు. కవిత శాసనమండలిలో కన్నీటి ప్రకటన తర్వాత జనగామలో నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. అక్కడక్కడ అలుగుడు, గులుగుడు ఉంటది. లేకుంటే కుటుంబమే కాదు. ఏదైనా ఉంటే ఇంట్లో అనుకోవాలి, కలిసి కొట్లాడాలన్నారు. కవిత కుటుంబంతో బంధం తెంచుకుంటున్నానని రాజకీయ శక్తిగా మారి తిరిగి వస్తానని ప్రకటించిన సందర్భంలో కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
జనగామ పట్టణంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ భూగోళంపై కానీ, నదులపై కానీ కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. గోదావరి ఎక్కడుందో తెలియని వ్యక్తి కేసీఆర్ గారికి పాఠాలు చెబుతున్నారని, అసలు సంబంధం లేని 'భాక్రా నంగల్' ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. "పాలన అంటే మూటలు మోయడం కాదు, ప్రజల కష్టాలు తీర్చడం" అని వ్యాఖ్యానిస్తూ, రేవంత్ రెడ్డికి తెలివి తక్కువ మాటలు తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ చెప్పిన రూ.15,000 రైతుబంధు, రూ.500 బోనస్, కౌలు రైతులకు సాయం వంటివి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. నాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న రాహుల్ గాంధీ, ఇప్పుడు ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని, తులం బంగారం దేవుడెరుగు.. కనీసం బతుకమ్మ చీరలు కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు పుస్తెల తాడు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణను సాధించిన మొనగాడు కేసీఆర్ అని, ఆయన చెప్పు ధూళికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తన చదువుపై రేవంత్ రెడ్డి ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదని, తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే రేవంత్ రెడ్డి లంగా పనులు చేస్తూ పెయింటింగులు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడితేనే రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నారని, ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చనిపోతారేమోనని వ్యంగ్యంగా అన్నారు. తన సొంత సెక్యూరిటీ సిబ్బందిని ప్రజల ముందే కొడుతున్న రేవంత్ తీరును చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టినట్లు ఉందని, ఆయన్ని కట్టివేయాలని రేవంత్ భార్య గీతకు సూచించామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ వేధింపులను, బెదిరింపులను తట్టుకొని నిలబడి సర్పంచులుగా గెలిచిన బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. "జనగామ ర్యాలీ చూస్తుంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారనిపిస్తోంది" అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మళ్ళీ గులాబీ జెండా వైపు చూస్తున్నారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. పదవుల కోసం పార్టీ మారిన కడియం శ్రీహరి వంటి వారిని ప్రజలే బుద్ధి చెబుతారని, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి వీరులు పుట్టిన ఈ గడ్డపై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.





















