KTR No Respect to Revanth Reddy: సభా నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చినా సీట్లోంచి లేవని కేటీఆర్.. సోషల్ మీడియాలో చర్చ
తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్షనేత కేసీఆర్ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు. ఆ సమయంలో కేటీఆర్, కౌశిక్ రెడ్డి మాత్రం తమ సీట్లో నుంచి లేవకపోవడం చర్చనీయాంశం అయింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నాడు అత్యంత ఆసక్తికరమైన, హుందాతనంతో కూడిన సన్నివేశం చోటుచేసుకుంది. అదే సమయంలో జరిగిన ఘటన రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి వచ్చిన సందర్భంలో ప్రతిపక్ష నేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయన యోగక్షేమాలను సరదాగా పలకరించారు.
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ, కేసీఆర్ తన సంస్కారాన్ని చాటుకుంటూ రేవంత్ రెడ్డి రాకను గమనించి వెంటనే లేచి నిలబడి ప్రతి నమస్కారం చేశారు. రేవంత్ రెడ్డికి స్వయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి తన హుందాతనాన్ని ప్రదర్శించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, మరొకరి హోదాను గౌరవించుకుంటూ సాగిన ఈ అరుదైన కలయిక సభలో అందరి దృష్టిని ఆకర్షించింది. రేవంత్ రెడ్డి చూపిన మర్యాద, కేసీఆర్ స్పందించిన తీరుపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ విమర్శలు..
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తోంది. సభా నాయకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమీపంలోకి వచ్చినప్పుడు, తమ పార్టీ అధినేత వద్దకు వచ్చి పలకరించగా కేసీఆర్ లేచి నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే కేటీఆర్, కౌశిక్ రెడ్డి కనీసం లేచి నిలబడకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని వారు ఆరోపిస్తుంటే, బీఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం దీనిని గట్టిగా సమర్థిస్తున్నాయి.

తన తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని, రేవంత్ రెడ్డి చేసే నాటకాలకు కేటీఆర్ పడిపోరని వారు కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. ఇలా కేసీఆర్, రేవంత్ ల స్నేహపూర్వక పలకరింపు ఎంత హాట్ టాపిక్‌గా మారిందో, కేటీఆర్ స్పందించని తీరు సైతం అంతే స్థాయిలో రాజకీయ చర్చకు దారితీసింది.

సభ నుంచి ఎందుకు వెళ్లిపోయారో కేసీఆర్‌నే అడగండి: రేవంత్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సభలోని ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తామని, అందులో భాగంగానే కేసీఆర్‌ను కలిసి పలకరించానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను తానేదో ఈరోజే కొత్తగా కలవలేదని, గతంలో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెళ్లి పరామర్శించానని రేవంత్ గుర్తు చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కేసీఆర్ అసెంబ్లీ నుండి వెళ్ళిపోవడంపై స్పందించారు. కేసీఆర్ సభ నుంచి అంత త్వరగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఆయన్నే అడగాలని మీడియా వారికి సూచించారు.
ఇద్దరు నేతలు కలుసుకున్న సమయంలో ఏం మాట్లాడుకున్నారనే విషయంపై మీడియా ప్రతినిధులు ఆరా తీయగా, రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తామిద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్న విషయాలను బయట అందరికీ ఎలా చెబుతామని సరదాగా వ్యాఖ్యానించారు. శాసనసభ వేదికగా ఇద్దరు అగ్ర నేతలు కరచాలనం చేసుకుంటూ, యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం సభలోని వారితో పాటు రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంది. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా, సభా సంప్రదాయాలను పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకోవడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






















