KCR Sensational Comments : కవితను కూడా పార్టీ మారాలని అడిగారు - కేంద్రానికే కాదు రాష్ట్రానికీ దర్యాప్తు సంస్థలు - సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
తన కుమార్తెనూ పార్టీ మారమని బీజేపీ నేతలు అడిగారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికే కాదని రాష్ట్రానికీ దర్యాప్తు సంస్థలు ఉన్నాయని.. ఎవరూ భయపడవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు.

KCR Sensational Comments : తన కుమార్తెనూ పార్టీ మారమని అడిగారని .. ఇంత కంటే ఘోరం ఉంటుందా అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో బీజేపీ తీరుపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారిపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు పెరిగే అవకాశం ఉందని .. కేసీఆర్ చెప్పే క్రమంలో కవిత ప్రస్తావన తీసుకు వచ్చారు. తన కుమార్తెను కూడా పార్టీ మారమని అడిగారన్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా దాడులు ఉంటాయని.. ఆందోళన చెందవద్దన్నారు. కేంద్రానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ...మనకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి...తేల్చుకుందామని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు.
ఈడీ దాడులు చేస్తే తిరగబడాలని కేసీఆర్ పిలుపు
ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చిన వ్యవహారంలో భారీ స్కాం జరిగిందని ఆరోపిస్తూ అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. సీబీఐ ఆ తర్వాత ఈడీ ఈ కేసుల్లో విచారణ ప్రారంభించాయి. మొదటి నుంచి ఢిల్లీ బీజేపీ నేతలు ఈ అంశంలో కేసీఆర్ కుమార్తె కవితను టార్గెట్ చేశారు. ఆమె కనుసన్నల్లోనే ఈ స్కాం జరిగిందని ఆరోపించడం ప్రారంభించారు. ఏ ఏ హోటళ్లలో కవిత లిక్కర్ సిండికేట్‌తో సమావేశమయ్యారో కూడా చెప్పడం ప్రారంభించారు. అయితే సీబీఐ దర్యాప్తు చేస్తూంటే బీజేపీ నేతలు ఇలా వివరాలు ప్రకటించడం ఏమిటని .. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. టీఆర్ఎస్ నేతలు ఇదే ఆరోపణ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితపై బీజేపీ నేతల ఆరోపణలు
ఢిల్లీ లిక్కర్ వ్యవహారంపై కేసీఆర్ ఇంత వరకూ బహిరంగంగా స్పందించలేదు. పార్టీ నేతలతో అంతర్గత సంభాషణల్లోనూ ఈ అంశంపై స్పందించలేదు. తొలి సారిగా పార్టీ కార్యవర్గ సమావేశంలో స్పందించారు. తన కుమార్తెను పార్టీ మారమని అడిగారని కేసీఆర్ చెప్పడం ద్వారా లిక్కర్ స్కాం కేసు ఈ కోణంలోనే వచ్చిందని చెప్పకనే చెప్పినట్లయింది. పార్టీ నేతలు కూడా ఈ విషయంలో కేసీఆర్‌కు సంఘిభావం తెలిపారు. బీజేపీ నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీకి అండగా ఉంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోంది.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని అయినప్పటికీ భయపడవద్దని.. ఆందోళనకు గురి కావొద్దని ఎమ్మెల్యేలకు ముఖ్య నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలపై గురి పెట్టారని.. వారి పేర్లను సమావేశంలో కేసీఆర్ వివరించినట్లుగా చెబుతున్నారు.
రాష్ట్రానికీ దర్యాప్తు సంస్థలు ఉన్నాయని కేసీఆర్ భరోసా
కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు మనకూ దర్యాప్తు సంస్థలు ఉన్నాయని కేసీఆర్ ధీమాగా ప్రకటించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ధైర్యం వచ్చింది. అయితే కేంద్రం దర్యాప్తు సంస్థలతో పోరాడగలమా అన్న సందేహం కొంత మంది ఎమ్మెల్యేల్లో ఉంది. అయితే కేసీఆర్ సామర్థ్యంపై అందరూ నమ్మకం వ్యక్తం చేశారు. బీజేపీతో.. కేంద్రంతో యుద్ధం చేయడానికైనా వెనక్కి తగ్గేది లేదన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. .కేసీఆర్ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

