Why KCR Absent : గళమెత్తాల్సిన సమావేశాలకు గైర్హాజర్ ! కేసీఆర్ రాజకీయం చేస్తున్నారా ? తెలంగాణ ప్రయోజనాల కోసమా ?
సదరన్ కౌన్సిల్ భేటీకి కేసీఆర్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ కోసం గళమెత్తాల్సిన భేటీలకు వ్యూహాత్మకంగా ఆయన హాజరు కావడం లేదంటున్నారు. ఇందులో ఉంది రాజకీయమా..? ప్రజాప్రయోజనమో?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయనకు బదులుగా హోంమంత్రి మహమూద్ అలీ హాజరవుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ హాజరవడం వేరు.. హోంమంత్రి హాజరవడం వేరు. ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ వెళ్లకపోతే ఇక తెలంగాణ ప్రాతినిధ్యం లేనట్లేనని అనుకోవాలి. నిజానికి ఈ సదరన్ కౌన్సిల్ భేటీ అత్యంత కీలకం. ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకబుచ్చుకునే వేదిక. ఆ విషయం తెలంగాణ సీఎంకు తెలియనిదేం కాదు. అయినా ఎందుకు ఆయన నిరాసక్తత ప్రదర్శించారు. సమస్యల పరిష్కారంపై నమ్మకం లేదా ? కేంద్రంపై అలా నిరసన వ్యక్తం చేశారా ? లేక సమస్యలుంటేనే రాజకీయం నడుస్తుందని ఆలోచిస్తున్నారా ?
Also Read : కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్
సదరన్ కౌన్సిల్ భేటీకి హాజరు కాని కేసీఆర్ !
దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కేసీఆర్ హాజరు కాకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి సమావేశానికి చాలా వరకూ దూరంగా ఉంటారు. ముఖ్యంగా కేంద్రం, ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్న సమావేశాలకు ఆయన దూరంగా ఉంటారు. ఇక తప్పని సరి అయితే కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని పంపుతారు. లేకపోతే అధికారులు వెళ్తారు. తిరుపతిలో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి మాత్రం హోంమంత్రి నేతృత్వంలో బృందాన్ని పంపారు. మహమూద్ అలీకి సబ్జెక్ట్ మీద ఎంత పట్టు ఉంటుందో తెలంగాణలో అందరికీ తెలుసు. ఇక ఆయన మాట్లాడేదేమీ ఉండదు. షెడ్యూల్ ప్రకారం కూర్చుని రావడమే. ఏమైనా ఉంటే అధికారులు ఆన్సర్ చేస్తారు. అంటే ఈ సమావేశం విషయంలో తెలంగాణ సీఎం ఎక్కువ ఆశలు.. పెట్టుకోలేదన్న మాట.
Also Read : హుజురాబాద్ ఓటమికి మీరంటే మీరే కారణం.. ఢిల్లీలోనూ టీ కాంగ్రెస్ నేతలది అదే పంచాయతీ !
సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ తరచూ డుమ్మా !
నిజానికి కేంద్రంతో జరిగే సమావేశాలు లేదా.. రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ వంటి సమావేశాలు.. ఇప్పుడు జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ వంటి భేటీలు అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీలో కొన్నికీలకమైన సమస్యలకు పరిష్కారం లభించింది. కొత్త ట్రైబ్యునల్ కోసం కేంద్రం అంగీకారం తెలిపింది. అయితే సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన కేసును ఉపసంహరించుకోవాల్సి ఉంది. ఆ మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో చర్చించి కేసీఆర్ అంగీకరించారు. అయితే ఏడు నెలల ఆలస్యంగా ఉపసంహరించుకున్నారనేది మరో విషయం. కానీ ఓ సమస్య పరిష్కారానికి అక్కడ బాట పడింది. ఇప్పుడు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలోనూ అలాంటి చర్చలే జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి సదరన్ కౌన్సిల్ భేటీ ఓ వేదిక అవుతుంది. ఏపీ దాదాపుగా రూ. ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి రావాలని అంటోంది.. కాదు తమకే రావాలని తెలంగాణ వాదిస్తోంది. కేంద్రం సమక్షంలో ఎవరు ఎవరికి ఇవ్వాలో తేల్చుకోవడం ఎంత సేపు ? ఆ అవకాశం సదరన్ కౌన్సిల్ లో వచ్చేది.కానీ కేసీఆర్ డుమ్మా కొట్టడం వల్ల అధికారులు రాసుకెళ్లింది మాత్రం చదవగలరు కానీ సొంత నిర్ణయాలు తీసుకోలేరు.
Also Read : టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఆశావహుల టెన్షన్..టెన్షన్ ! అభ్యర్థుల కసరత్తులో కేసీఆర్ !
సమస్యలను అలాగే కొనసాగించాలనుకుంటున్నారా ?
దేనికైనా కేంద్రం వద్ద పంచాయతీకి వెళ్లడం కేసీఆర్‌కు ఇష్టం ఉండదంటారు. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లినప్పుడు బేసిన్లు, భేషజాలు లాంటివేమీ లేవని తామే పరిష్కరించకుంటామని కేంద్రం వద్దకు వెళ్లబోమని చెప్పారు. అయితే అనుకున్నట్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరగలేదు. కానీ కేంద్రానికి పదే పదే లేఖలు రాసి.. ప్రాజెక్టులు కేంద్రం చేతికి వెళ్లిపోయేలా రెండు రాష్ట్రాలూ చేసుకున్నాయి. అయితే రెండు రాష్ట్రాలూ ఇప్పుడు గెజిట్‌ను అమలు చేయలేకపోతున్నాయి. ఇలా తాము చర్చించుకుంటే సమసిపోయే సమస్యలను కూడా కేంద్రం దగ్గరకు వెళ్లిపోయిన సమయంలోనూ కేసీఆర్ ఎందుకు చొరవ చూపి... సదరన్ కౌన్సిల్ సమావేశాలకు హాజరు కావడం లేదన్నది ఎవరికీ అర్థం కాని విషయం.
Also Read : ఖమ్మం ఎమ్మెల్సీ రేసులో తుమ్మల, పొంగులేటి.. సీఎం కేసీఆర్ మెచ్చేదెవరు?
ప్రెస్‌మీట్లలో కేంద్రానికి చేసే డిమాండ్లు అధికారిక సమావేశాల్లో చేయడానికి సిద్ధపడరా ?
ఏపీతో కాకపోయినా కేంద్రంతో తేల్చుకోవాల్సిన అంశాలు కూడా కేసీఆర్‌కు చాలా ఉన్నాయి. ఇప్పటి బర్నింగ్ టాపిక్ అయిన వడ్లు కొనుగోలు దగ్గర్నుంచి విభజన హామీల వరకు అనేక సమస్యలపై కేంద్రాన్ని నిలదీసే అవకాశం సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో లభిస్తుంది. అప్పటికప్పుడు ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్‌లో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కేసీఆర్‌కు తెలియక కాదు. అయినప్పటికీ ఎందుకో కానీ ఆయన సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ప్రెస్‌మీట్లలో కేంద్రానికి చేసే డిమాండ్లు అధికారిక సమావేశాల్లో చేయడానికి సిద్ధపడరని ఇతరులు విమర్శించినా ఆయన పట్టించుకోరు.
కేంద్రం, ఏపీతో సమస్యలుంటేనే రాజకీయంగా మేలు జరుగుతుందా?
సాధారణంగా రాజకీయ నాయకులకు సమస్యలే రాజకీయ అంశాలు. సమస్యలు పరిష్కారం అయితే చేయడానికి రాజకీయం ఉండదు. ముఖ్యంగా తమకు కలసి వచ్చే సమస్యలు ఉంటే వారు వాటిని లైవ్‌లో ఉంచడానికే ప్రయత్నిస్తారని రాజకీయవర్గాలు అంచనా వేస్తూంటాయి. అదే తరహాలో కేసీఆర్ కూడా ప్రస్తుతం కేంద్రంతో విభేదాలు, పొరుగు రాష్ట్రంతో గొడవలు ఉండటం అవసరం అని భావిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోంది. టీఆర్ఎస్‌కు సవాల్ విసురుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తెలంగాణకు ఏమీ చేయడం లేదన్న సెంటిమెంట్‌తో ఎదుర్కోవడానికి సమస్యలు ఉండాలన్న అభిప్రాయంతో కేసీఆర్ ఉండిఉండవచ్చంటున్నారు. ఇక తన పార్టీకి మొదటి నుంచి అచ్చి వచ్చిన సెంటిమెంట్ .. ఆంధ్ర వ్యతిరేకత. దాన్ని చిటికెలో సమస్యను పరిష్కరించి వదిలేస్తే తర్వాత రాజకీయం చేయడానికి ఏముంటుందని కేసీఆర్ ఆలోచన చేస్తూ.. సమస్యల పరిష్కార సమావేశాలకు డుమ్మా కొడుతున్నారన్న అభిప్రాయం కూడా రాజకీయవర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది.
Also Read : కల్వకుంట్ల కవితకు మరోసారి ఎమ్మెల్సీ చాన్స్ వస్తుందా ?
పక్కా వ్యూహం ప్రకారమే కేసీఆర్ నిర్ణయాలు !
ఇలాంటి విషయాల్లో రాజకీయ విమర్శలు వచ్చినా కేసీఆర్ వెనక్కి తగ్గరు. ఏదైనా రాజకీయ లాభనష్టాలు బేరీజు వేసుకుని కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. జోనల్ సమావేశానికి.. అపెక్స్ కౌన్సిల్ వంటి వాటికి హాజరైతే.. హాజరవ్వకపోతే వచ్చే ప్లస్ మైనస్‌లు చూసుకునే ఆయన రంగలోకి దిగుతారు. అందుకే హాజరు కాకపోవడం వల్లనే ఎక్కువ ప్రయోజనం కాబట్టి ఆయన డుమ్మా కొడుతున్నారని అనుకోవచ్చు. అయితే ఆ ప్రయోజనం.. తెలంగాణ రాష్ట్రానికా ? ప్రజలకా ? లేక తెలంగాణ రాష్ట్ర సమితికా ? అన్నది మాత్రం సస్పెన్స్.
Also Read : పెట్రో పన్నుల పాపం అంతా కేంద్రానిదేనా ? రాష్ట్రాల వాదనేంటి ? కేంద్రం చెబుతున్నదేంటి ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి