Karimnagar Bear: కరీంనగర్‌లో మళ్ళీ ఎలుగుబంటి దడ! సవాలుగా మారిన సమస్య, అధికారులు ఉరుకులు పరుకులు
యూనివర్సిటీలో గతంలో ఓ ఎలుగుబంటి ఒక 15 నిమిషాల పాటు అక్కడే తచ్చాడింది. ఓ విద్యార్థిని సదరు తన ఫోన్ లో రికార్డ్ చేసి యూనివర్సిటీ ఉన్నతాధికారులకు సమాచారం అందించింది.
కరీంనగర్ పట్టణ శివారులో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి మరోసారి హల్ చల్ చేసింది. మంగళవారం రాత్రి నుండి బయటకు రావడాన్ని సమీపంలో నివాసం ఉంటున్న కొందరు గమనించి వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు అసలు అది ఎటు వైపు వెళ్లిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. అయితే రాత్రి సమయంలో ఎలుగుబంటి యూనివర్సిటీ సమీపంలో ఉన్న మల్కాపూర్ రోడ్ లోగల ఇంటి ప్రహరీలోకి ప్రవేశించింది. అయితే అలికిడికి మెలకువ రావడంతో ఆ ఇంటి యజమాని లైట్ వేసి చూడగా ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. భయపడి కేకలు వేస్తూ అరవడంతో అది గోడ దూకి మార్క్ ఫెడ్ గ్రౌండ్ వైపు పరుగులు తీసింది. దీంతో హుటాహుటిన తన పొరుగు వారితో కలిసి అటవీశాఖ సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై దాన్ని పట్టుకోడానికి అన్నిరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. మార్కెట్ పరిసర ప్రాంతాన్ని మొత్తం గాలించగా ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. తిరిగి యూనివర్సిటీలో దట్టంగా ఉన్న చెట్ల వైపు వెళ్లి ఉంటుందని దాని పాద ముద్రలను బట్టి అంచనాకు వచ్చారు.
గతంలోనూ యూనివర్సిటీలోని నీటి గుంత వద్దకు వచ్చిన ఎలుగుబంటి ఒక 15 నిమిషాల పాటు దాదాపు అక్కడే తచ్చాడింది. అక్కడే హాస్టల్లో నివాసం ఉంటున్న ఓ విద్యార్థిని సదరు తన ఫోన్ లో రికార్డ్ చేసి యూనివర్సిటీ ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. అప్పుడు పెద్ద ఎత్తున బలగాలతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన అటవీశాఖ అధికారులకు మాత్రం దాని జాడ తెలియరాలేదు. ఇప్పుడు మరోసారి అదే ఎలుగుబంటి వచ్చిందా? లేక బయట నుండి వేరే ఎలుగుబంటి వచ్చిందా అనే విషయంపై యూనివర్సిటీ అధికారులతో పాటు అటవీశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున నివాసముండే ప్రాంతాల్లోకి ఎలుగుబంటి రావడంతో పాటు యూనివర్సిటీలో నిత్యం విద్యార్థులతో సందడిగా ఉండే ప్రాంతంలో మళ్లీ అది కనిపించడంతో అందరూ భయపడుతున్నారు.
విద్యార్థులు సైతం జాగ్రత్తగా ఉండాలని సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత చీకటి పడే వేళకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదని యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. అటవీశాఖ అధికారులు సైతం ఎలుగుబంటిని పట్టుకోవడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముందుగా అసలు వాటి సంఖ్య ఎంత ఉందనే విషయంపై కూడా ఒక అంచనాకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సారైనా వారి ట్రాప్ లో ఎలుగుబంటి పడుతుందా లేదా వేచి చూడాలి.