Revanth Reddy: BRS నుంచి పైసలు తీసుకోలేదు- అమ్మవారిపై ఒట్టేద్దాం, వస్తావా: ఈటలకు రేవంత్ సవాల్
Revanth Reddy: కేసీఆర్ నుంచి డబ్బులు తీసుకునే ఖర్మ తనకేం పట్టలేదని.. కావాలంటే భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెప్తానని ఈటెల రాజేందర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Revanth Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనపై చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి తాను డబ్బులు తీసుకునే ఖర్మ తనకేం పట్టలేదని అన్నారు. ఏప్రిల్ 22వ తేదీ శనివారం రోజు సాయంత్రం ఆరు గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వస్తానన్నారు. బీఆర్ఎస్ నుంచి తాను డబ్బులు తీసుకోలేదని అమ్మవారిపై ప్రమాణం చేస్తానని.. ఈటల కూడా వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఈటల దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఈ ఆలయం వద్దంటే ఈటల చెప్పిన మరో గుడికైనా వస్తానని వెల్లడించారు. తన సవాల్ స్వీకరించిన ఈటల దీనిపై స్పందించాలన్నారు. అయినా ఆరు నెలలు అయితే రాష్ట్రమే తమ అధికారంలోకి వస్తుందని.. అలాంటిది కేసీఆర్ దగ్గర 25 కోట్లు తీసుకోవాల్సిన అవసరం తమకేంటని అన్నారు. విచక్షణ కోల్పోయి మాట్లాడితే ఎలా అంటూ ఈటల రాజేందర్ పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
తనపై ఈటల రాజేంధర్ చేసిన ఆరోపణలకు.. రాష్ట్ర ప్రజలకు తాను స్పష్టతను ఇవ్వాలనుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద సిద్ధంగా ఉంటనన్నారు. అలాగే ఈటల కూడా రావాలని మరోసారి తెలిపారు. అలాగే మునుగోడు ఎన్నికల సమయంలో పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులే తనకు సాయం చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ సాయం చేయమన్నా ఎవరూ స్పందించలేదని రేవంత్ రెడ్డి వివరించారు.