Jagga Reddy: జగ్గారెడ్డిలో లవ్ యాంగిల్ కూడా! టెన్త్ క్లాస్‌లోనే మొదలు - ఆమె ఎవరో చెప్పేసిన ఎమ్మెల్యే
Sangareddy: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం (సెప్టెంబరు 6) సాయంత్రం పట్టణంలోని మహిళా జూనియర్ కాలేజీలో సందడి చేశారు. అంతకుముందు కాలేజీ సిబ్బందితో రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే, ఆ తర్వాత విద్యార్థినులతో మాట్లాడారు. సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. సతీమణి నిర్మలను వేదికపైకి పిలిచి అందరికి పరిచయం చేశారు. ఆ సందర్భంగా తాను టీనేజీలో ఉన్నప్పుడు ఆమెను ప్రేమించినట్లుగా చెప్పుకొచ్చారు. తన భార్య ఇంటర్ బైపీసీ చదివిందని, డిగ్రీలో బీకామ్ చదివిందని గుర్తు చేసుకున్నారు. భార్యకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని, అయినా తనతో రాజీనామా చేయించి తన వెంట తెచ్చుకున్నట్లుగా చెప్పారు.
తాను మాత్రం ఇంటర్ చదివానని, అయినా తన క్వాలిఫికేషన్ పదో తరగతి మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇంటర్మీడియట్ తాను ఫెయిల్ అయ్యానని అన్నారు. పదహారేళ్ల వయసులోనే ఇంటర్ డిస్‌కంటిన్యూ చేసి రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. తన గడ్డం, అవతారం చూస్తే ఎవరైనా పదో తరగతి అని అనుకుంటారని చమత్కరించారు.
‘‘19 ఏళ్ల వయసులోనే నేను మున్సిపల్ కౌన్సిలర్ అయ్యా. 31 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా గెలిచా. నా మాటలు విని మీరు చెడిపోయేరు. మా ఆవిడకు నాకు మధ్యలో పదో తరగతిలోనే లవ్ మొదలైంది’’ అని గుర్తు చేసుకున్నారు. దీంతో అక్కడున్న విద్యార్థులు, ఎమ్మెల్యే అనుచరులు అందరూ ఉత్సాహంతో ఈలలు వేస్తూ సందడి చేశారు. ఆ సమయంలో ఆయన కుమార్తె జయా రెడ్డి కూడా అక్కడ ఉన్నారు.
రివ్యూలో కీలక డిమాండ్స్
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థినులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పారు. జూనియర్ ఇంటర్ విద్యార్థుల బస్‌పాస్ ధరలు తగ్గించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రూ.200లకే ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ను కలుస్తానని అన్నారు.
కాలేజీల్లో సరైన వసతులు లేక ఆడపిల్లలను తల్లిదండ్రులు స్కూళ్లకి పంపడం లేదని తేలిందని అన్నారు. సంగారెడ్డిలోని కళాశాలల్లో ఈ ప్రాంత విద్యార్థులే కాకుండా నారాయణఖేడ్, నర్సాపూర్, జోగిపేట, వికారాబాద్, గజ్వేల్, నర్సాపూర్, పటాన్‌చెరు తదితర ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నారని, కాబట్టి, మౌలిక వసతులు సక్రమంగా ఉండాలని చెప్పారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారని అన్నారు. సకాలంలో బస్సులు రావడం లేదని, పాసుల ధరలు విపరీతంగా పెంచారని చెప్పారన్నారు. ఈ అంశాలన్నింటినీ తాను అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని అన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, సంబంధిత అధికారులకు లేఖలు పంపుతానని అన్నారు.
వీఆర్ఏల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా - జగ్గారెడ్డి
వీఆర్ఏ సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా వీఆర్ఏ జేఏసీ నాయకులు ఆయనను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు గడిచాయని అన్నారు. అయినా, ఆ హామీ నిలబెట్టుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.