boy suicide: అపార్ట్మెంట్ పైనుంచి దూకిన పదో తరగతి విద్యార్థి సూసైడ్- చివరి నిమిషంలో తల్లికి మెస్సేజ్!
రాయదుర్గంలో పదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన చివరకు విషాదంతమైంది.
పదో తరగతి చదివే విద్యార్థి తాను చనిపోతున్నాను అని తల్లికి మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసిన తల్లి వెంటనే చుట్టుపక్కల అంతా వెతికింది. కానీ తన కుమారుడు ఆచూకీ తెలియలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించారు. విచారణలో ఏమి తెలిసిందంటే?
హైదరాబాద్ లోని రాయదుర్గంలో మై హోమ్ అపార్ట్మెంట్ పైనుంచి దూకి బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఎంత సమయమైనా గాని తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుమారుడు కోసం వెతికారు. అనంతరం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలోని మంగళవారం ఉదయం ఏడు గంటలకు బాలుడి కుటుంబం నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పక్క బ్లాక్ ముందు రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహం లభ్యమయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు
సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ కోసం మై హోమ్స్ అపార్ట్మెంట్ ను పరిశీలించారు. బాలుడు కనిపించలేదని నిర్ధారించాక అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఆ బాలుడు బయటకు వెళ్లలేదని తెలుసుకున్నారు. ఆ అపార్ట్మెంట్ లోనే ఉన్నాడని... మరింత గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అన్ని బ్లాక్లు పరిశీలించిన తర్వాత. మూడో గేట్ ఎంట్రెన్స్ జే బ్లాగ్ డక్ ఏరియా లో విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విద్యార్థి మృతదేహానికి పోలీసులు పరిశీలించగా సోమవారం రాత్రి సుమారు 7:30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు.
ఆన్ లైన్ గేమ్, చదువు ఒత్తిడిడే కారణమా??
గత కొద్దిరోజులుగా విద్యార్థి ఆన్ లైన్ గేమ్ కు బానిస కావడం, చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు మొదట భావించారు. ఇంకా దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.... హైదరాబాద్లోని మై హోమ్ అపార్ట్మెంట్లో సురేష్ రెడ్డి తన భార్య, కుమారుడు రేయాన్ష్ రెడ్డి (14) నివాసం ఉంటున్నారు. రేయాన్ష్ రెడ్డి ఖాజా గూడా లోని ఓ క్రిడ్జ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే సోమవారం రాత్రి 7:30 గంటలకు రేయాన్ష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రేయాన్ష్ తన తల్లికి చనిపోతున్నానని ఫోన్ కు మెసేజ్ పంపించాడు. అందులో తాను పర్సనల్ కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పాడు. అయితే చదువుపై ఒత్తిడి, ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివేమీ తమ దృష్టికి రాలేదని ఏసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
అయితే విద్యార్థి ఆత్మహత్యనే? కాదా? చనిపోవడానికి కారణాలు ఏమిటి? చనిపోవడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేశాయి? తల్లితోపాటు చివరిసారి ఇంకా ఎవరికైనా మెసేజ్ పంపించాడా? పలుకోనాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థి తండ్రి ఓ ఫైనాన్స్ కంపెనీలు పనిచేస్తున్నాడు. ముంబై నుంచి గత సంవత్సరం హైదరాబాద్ కి వచ్చారు.
" తన కుమారుడు కనిపించలేదని బాలుడు తల్లి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. మేము వెంటనే అపార్ట్మెంట్ కి వెళ్లి దర్యాప్తు చేపట్టాం. సీసీ కెమెరాలు పరిశీలించాం. బాలుడు అపార్ట్మెంట్ లోనే ఉన్నాడని బయటకు వెళ్లలేదని తెలుసుకున్నాం. ఆ అపార్ట్మెంట్ మొత్తం వెతికిన తర్వాత జే బ్లాక్ లో విద్యార్థి మృతదేహం కనిపించింది. సుమారు రాత్రి 7:30 సమయంలో చనిపోయినట్లు గుర్తించాం. 34 ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకొని ఇలాంటి పరిస్థితులు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నాం" అని మాదాపూర్ ఎసిపి శ్రీనివాస్ వెల్లడించారు.