Congress Internal Fight : టీకాంగ్రెస్ లో చిచ్చురేపిన యశ్వంత్ సిన్హా పర్యటన, మళ్లీ రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి
Congress Internal Fight : తెలంగాణ కాంగ్రెస్ లో యశ్వంత్ సిన్హా పర్యటన చిచ్చురేపింది. యశ్వంత్ సిన్హాకు వీహెచ్ స్వాగతం పలకడంపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు.
Congress Internal Fight : తెలంగాణ కాంగ్రెస్ లో యశ్వంత్ సిన్హా పర్యటన పెద్ద దుమారాన్నే రేపింది. ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పోస్ట్ తీసేస్తే రేవంత్ కు విలువ ఎంతో అందరికీ తెలుసన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ హైదరాబాద్ వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుంతరావు వెళ్లారు. దీనిపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి బండకేసి కొడతానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. మేమేమైనా పాలేర్లమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయానికి టెంప్ట్ అయ్యే వాడివి పీసీసీ పోస్టుకు అనర్హుడని విమర్శించారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలని హైకమాండ్ కు లేఖ రాస్తానని తెలిపారు.
రేవంత్ క్షమాపణలు చెప్పాలి
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వంద శాతం తప్పేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఏంకాదని ఆయన స్పష్టం చేశారు. వీహెచ్ వయసుకు కూడా గౌరవం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ పోరగాడని, బండకేసి ఎవర్ని కొడతావంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
విపక్షాల తరపున రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన యశ్వంత్ సిన్హా తెలంగాణకు వచ్చారు. అయితే ఆయనను టీఆర్ఎస్ నేతలు మాత్రమే కలిశారు. కానీ దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు మాత్రం కలవలేదు. ఈ అంశంపై ఆ పార్టీలోనే దుమారం రేగుతోంది. ఈ అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. యశ్వంత్ సిన్హా తమ కోసం రాలేదని..టీఆర్ఎస్ మద్దతు అడగడానికే వచ్చారని.. తాము ఎందుకు ప్రత్యేకంగా వెళ్లి మద్దతు ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు. ఇదేవిషయాన్ని మీడియాతో చెప్పారు. నా ఇంటికి వచ్చి తలుపు తడితే తాను తీస్తాను కానీ పక్కింటికి వెళ్లి తలుపు తడితే తానేందుకు తీస్తానని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ను మొదట కలిస్తే.. యశ్వంత్ సిన్హా నే కాదు బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదని స్పష్టం చేశారు.
ఎవరూ మొనగాళ్లు కాదు
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అర్థం పర్థం ఉండాలని, మతి తప్పి వ్యవహరిస్తే ఎవరినైనా పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే తీసి గోడకేసి కొడతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. పిల్లలాటలు ఆడొద్దని, ఇది రాజకీయ పార్టీ అన్నారు. అధిష్టానంతో మాట్లాడి నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. ఎవ్వరూ మొనగాళ్లు కాదని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి.