Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్
Hyderabad News: కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నా, వివరాలు మార్చుకోవాలంటున్న వారికి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కొత్త వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు.
Hyderabad News: కొత్త ఓటర్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్నా, అందులోని వివరాలను మార్చుకోవాలి అనుకున్నా, కార్డు ట్రాన్స్ ఫర్ చేయించుకోవడం వంటివి చేసుకోవడం కోసం మరో కొత్త వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ఉన్న ఓటర్ పోర్టల్ సర్వీస్(ఎన్వీపీఎస్) వెబ్ సైట్ కు బదులుగా "ఓటర్స్" పేరుతో కొత్త వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, జాబితా నుంచి పేరు తొలగింపు, చిరుమానా మార్పు వంటి అవసరాలకు 6, 6ఏ, 7, 8 వంటి ఫారాలను వినియోగిస్తూ ఇకపై కొత్త వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, పాత వెబ్ సైట్ కు ఇక పని చేయదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కొత్త వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత విశిష్ట రిఫరెన్స్ నంబర్ ను ఎస్ఎంస్, మెయిల్ ద్వారా దరఖాస్తుదారులకు పంపిస్తామన్నారు.
ఈ నెంబర్ ద్వారా దరఖాస్తు స్థితిగతులను తెలుసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు. కొత్త పోర్టల్ ద్వారా ఓటర్ల జాబితాను పరిశీలించవచ్చని, ఓటరు గుర్తింపు కార్డు కోసం, ఓటరు కార్డులో మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటర్ ఏ పోలింగ్ బూత్, శాసన సభ, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాడు అన్న వివరాలు సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు. పోలిసంగ్ బూత్ స్థాయి అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో)ల వివరాలను సైతం తెలుసుకోవచ్చని వివరించారు.