Jr Ntr Meets Amit shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ, ఎందుకంటే?
Jr Ntr Meets Amit shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాబోతున్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ డిన్నర్ కు వెళ్తున్నారు.
Jr Ntr Meets Amit shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలవబోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా అమిత్ షా ఎన్టీఆర్ ను డిన్నర్ మీట్ కు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు యంగ్ టైగర్ డిన్నర్ కోసం వెళ్లనున్నారు. 15 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం జరగనుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా చూశారు కేంద్ర మంత్రి అమిత్ షా. అందులో ఎన్టీఆర్ నటన చూసి ఫిదా అయ్యానని.. ఈ క్రమంలోనే ఆయనతో మాట్లాడని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేవలం సినిమా గురించే కాకుండా పలు రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగే అకాశం కనిపిస్తోందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. అమిత్ షా పర్యటలో చాలా ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హీరో ఎన్టీఆర్ నే కాకుడా ఓ సామాన్య కార్యకర్త ఇంటికి కూడా వెళ్లబోతున్నారు అమిత్ షా. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం.. మోండా డివిజన్ సాంబ మూర్తి నగర్ లోని బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ తాగనున్నారు. సాంబమూర్తి నగర్ లో ఉండే మంద సత్యనారాయణ.. 30 సంవత్సరాల నుంచి బీజేపీ కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం సత్య నారాయణ సికింద్రాబాద్ మహంకాళి ఎస్పీ మోర్చ సెక్రెటరీగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మునుగోడు భారీ బహరంగ సభ కోసం వచ్చిన అమిత్ షా..
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు చాలా టైమే ఉంది. కానీ మునుగోడు ఎన్నిక ఆ సమయాన్ని కుదిస్తుందని అంతా అనుకుంటున్నారు. పార్టీలేవి రాజీపడే ధోరణితో అస్సలే లేవు. మునుగోడు ఉప ఎన్నికను అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అక్కడా, ఇక్కడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ సవాలుగా తీసుకున్నాయి. తమ బలాన్ని, బలగాన్ని, ఆర్థిక పుష్టిని చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి. హుజూరాబాద్ బైపోల్ రాష్ట్ర చరిత్రలో అత్యంత కాస్ట్లీగా నిలిచాయి. అయితే మునుగోడు ఎన్నిక దాని కంటే ఎక్కువ రేంజ్ కు చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ మాటల దాడి తీవ్రంగా ఉండటంతో అదే స్థాయిలో వాటిని తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. కేసీఆర్ చేసిన విమర్శలను ధాటిగా బదులివ్వాలని వ్యూహ రచన చేస్తున్నారు కమలదళ నాయకులు. మునుగోడులో భారీ సభ నిర్వహించాలని అనుకుంటోంది బీజేపీ. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా పర్యటన కొనసాగనుంది. అయితే మునుగోడు సభలో అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
షా టూర్ షెడ్యూల్...
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా బేగంపేటకు చేరుకుంటారు. తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత భాజపా కార్యకర్త ఇంటికి, ఆతర్వాత రైతులతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు మునుగోడు సభలో షా పాల్గొంటారు.