Revanth Reddy Vs Jaggareddy : టీకాంగ్రెస్ లో ముదిరిన వివాదం, రేపు సంచలన ప్రకటన చేస్తానంటున్న జగ్గారెడ్డి
Revanth Reddy Vs Jaggareddy : తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం మరింత ముదిరింది. రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి ఎపిసోడ్ మళ్లీ మొదటకు వచ్చింది. రేపు సంచలన ప్రకటన చేస్తానని జగ్గారెడ్డి అంటున్నారు.
Revanth Reddy Vs Jaggareddy : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చురేపింది. ఇప్పుడీ వివాదం మరింత ముదిరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన గోడకేసి కొడతా కామెంట్స్ పై ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మరోసారి అధిష్ఠానానికి లేఖ రాస్తానని అన్నారు. అయితే ఈ వివాదంపై మరోసారి స్పందించిన జగ్గారెడ్డి రేపు సంచలన ప్రకటన చేస్తానని చెప్పుకొచ్చారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు జగ్గారెడ్డి ప్రయత్నించగా పార్టీ పెద్దల బుజ్జగింపులతో చల్లబడ్డారు. రేపు ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో అని కాంగ్రెస్ శ్రేణులు సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అందుకే మీడియా ముందుకు
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరు మారలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిటెండ్ జగ్గారెడ్డి ఆరోపించారు. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనపై రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో చర్చించలేదన్నారు. పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేయకుండానే చర్చించినట్లు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. యశ్వంత్ సిన్హాను ఆహ్వానించేందుకు ఎవరైనా వెళితే గోడకేసి కొడుతా అని అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విపరీత ధోరణి వల్లే తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడానని చెప్పుకొచ్చారు. రాజకీయ యుద్ధం చేయాలంటే ఒక వ్యూహం ఉండాలన్న ఆయన రేపు సంచలన ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు.
రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి ఎపిసోడ్ నడుస్తోంది. గతంలో పార్టీలో విభేదాల గురించి మీడియా ముందు మాట్లాడితే రేవంత్ రెడ్డి వర్గం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అనేకసార్లు ఫిర్యాదు చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీ వ్యవహారాలపై రాహుల్‌గాంధీతో గతంలో సమావేశం జరిగిందని, అయినా రేవంత్ రెడ్డి తీరు మారలేదని జగ్గారెడ్డి అన్నారు. అయినా ఈ మూడు నెలల్లో తాము మీడియా ముందుకు రాలేదన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన గురించి పార్టీ ఎంపీలతో రేవంత్ రెడ్డి ఎలాంటి సమావేశం ఏర్పాటుచేయలేదన్నారు. సమావేశం ఏర్పాటుచేయకుండానే ఏర్పాటుచేసినట్లు రేవంత్ రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు.
Also Read : Amit Shah: తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకొస్తాం: అమిత్‌షా, భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో తీర్మానం