Krishnam Raju Final Rites : ఇక సెలవు రారాజు, అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి
Krishnam Raju Final Rites : రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య కృష్ణంరాజు అంతిమ సంస్కారాలను ప్రభాస్ సోదరుడు ప్రభోద్ నిర్వహించారు.
Krishnam Raju Final Rites : అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు ఇంటి వద్ద ఉంచిన భౌతికకాయానికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించింది. సోమవారం సాయంత్రం మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాంహౌజ్‌లో రెబల్ స్టార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ప్రభోద్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు
హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీద కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించారు. అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున కనకమామిడి ఫాంహౌస్ కు చేరుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు కృష్ణంరాజు అంత్యక్రియలకు హాజరయ్యారు. సోమవారం ఒంటిగంట తర్వాత జూబ్లీహిల్స్ నుంచి మొదలైన అంతిమ యాత్రలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణంరాజు అంతిమ సంస్కారాలకు పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి రెబల్ స్టార్ కు గన్ సెల్యూట్ చేశారు. అంత్యక్రియలకు అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్ లోపలికి అనుమతించారు పోలీసులు. ఫామ్ హౌస్ లో భద్రతా ఏర్పాట్లను శంషాబాద్ డీసీపీ పర్యవేక్షించారు.
పాడె మోసిన భార్య
నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలను మొయినాబాద్ సమీపంలోని కనకమామిడిలో ఉన్న ఫామ్ హౌస్ లో నిర్వహించారు. ఆయన పార్థివదేహం అంతిమయాత్రలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. కృష్ణంరాజు ఇంటి నుంచి ఫామ్ హౌస్ కు పార్థివదేహాన్ని తరలించే సమయంలో ఆయన భార్య శ్యామలా దేవి వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజుకి శ్యామలాదేవికి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. కృష్ణంరాజు అంటే శ్యామలాదేవికి ఎంతో ప్రేమ. తన లైఫ్ లో ఆయన పెద్ద గిఫ్ట్ అని చెబుతుంటారామె. అటువంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం ఆమె తట్టుకోలేకపోతున్నారు.
విజయనగర సామ్రాజ్య రాజవంశస్తులు:
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆయనకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించారు. 1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 1986 లో తాండ్ర పాపారాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
Also Read : Krishnam Raju: కృష్ణంరాజు పాడె మోసిన భార్య - గుండె బరువెక్కిస్తున్న దృశ్యాలు
Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!