Harish Rao : తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి - వరుసగా ఘోరాలు - సర్కార్‌పై హరీష్ రావు విమర్శలు
Telangana News : తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టపగలు నడి రోడ్డుపై ఘోరాలు జరుగుతున్నాయన్నారు.
Telangana Politics : తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నదని గుర్తు చేశారు.
రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షిచే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం.
— Harish Rao Thanneeru (@BRSHarish) June 19, 2024
గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు.
హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్…
రివాల్వర్ తో మహిళా కానిస్టేబుల్ బెదిరించి రేప్ చేసిన ఎస్ఐ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలో కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో భవాని సేన్ గౌడ్ ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నాడు. ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి “ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని” ప్రాధేయపడ్డాడు. ఇంటికి వచ్చిన మహిళా కానిస్టేబుల్ ను సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. రెండు రోజుల క్రితం సదరు మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి అత్యాచారం చేశాడు. తనకు మంత్రి అండదండలు ఉన్నాయని ఎవరూ ఏమీ చేయలేరని పలుమార్లు మహిళా కానిస్టేబుల్ ను భయభ్రాంతులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు ఎస్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.