Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
నిర్మల్ జిల్లా బైంసాలో గణేష్ నిమజ్జనం భారీ భద్రత మధ్య జరుగుతోంది. 133 విగ్రహాలు ప్రతిష్టించగా 100కుపైగా విగ్రహాల నిమజ్జం పూర్తయ్యింది. పిల్లలు, పెద్దలు అంతా సందడిగా నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలో వినాయక నిమజ్జనం సందడిగా సాగుతోంది. భైంసా పట్టణంలోని మున్నూరు కాపు సార్వజనిక్ గణేష్ మండలి దగ్గర వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి. గణేష్ శోభాయాత్ర బైంసా పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగుతోంది. డప్పులు, ఆటపాటలతో పట్టణమంతా సందడిగా మారింది. యువకులు మహిళలు, పిల్లలు అంతా... శోభాయాత్ర ముందు స్టెప్పులు వేస్తూ ముందుకు కదులుతున్నారు. బైంసాలో జరుగుతున్న గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
భైంసాలో మొత్తం 133 విగ్రహాలు ప్రతిష్టించగా ఇప్పటికే 100కుపైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణం మొత్తం... ప్రత్యేక పికెటింగ్, భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నిర్మల్ జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. భైంసా పట్టణానికి నాలుగు దిక్కుల ప్రత్యేకమైన చెక్ పోస్టులు పెట్టామన్నారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నారు.
భైంసాలో నిమజ్జన కార్యక్రమానికి ఎస్పీతో పాటు ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 45మంది ఎస్సైల తోపాటు సుమారు మొత్తం 700 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. భైంసా పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఇంకా 30కిపైగా విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని చెప్పారు చెప్పారు.
మరోవైపు... భైంసా పట్టణంలో జరుగుతున్న గణేష్ శోభయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభయాత్ర ముందు డ్యాన్సులు చేస్తున్న యువకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఒకరి తల పగలగా... మరొకరికి గాయాలయ్యాయి. వారిని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ నిరాకరించారు.