Leopard Caught : చిరుత చిక్కింది - ఫార్మా పరిశ్రమలో చొరబడిన చిరుతను ఇలా పట్టుకున్నారు !
Leopard Caught in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఓ ఫార్మా పరిశ్రమలోకి చొరబడిన చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు. మేకపిల్లను ఎరగా వేసి.. మత్తు ఇంజక్షన్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు.
Leopard Caught in Sangareddy: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో ఉన్న హెటెరో పరిశ్రమలో చొరబడిన చిరుతను అటవీ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు పరిశ్రమలోకి చిరుత చొరబడిందని తెలిసిన వెంటనే.. సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు నాలుగు బోన్లతో మేక పిల్లలను ఎరగా వేసి.. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. సుమారు ఆరేడు గంటల ఆపరేషన్ తర్వాత.. చిరుతను విజయవంతంగా పట్టుకోలిగారు.
హైటెన్షన్ ఆపరేషన్ - చివరికి చిక్కిన చిరుత
పరిశ్రమలోకి ఎలా వచ్చిందో కానీ చిరుత యంత్రాల మధ్య దర్జాగా తిరగడం ప్రారంభించింది. అయితే తన ఉనికి తెలిసిపోయిదని చిరుతకు అర్థమైన తర్వాత .... పట్టుకోవడానికి వచ్చిన అటవీ సిబ్బందితో దాగుడు మూతలు ఆడటం ప్రారంభించింది. యంత్రాల మధ్య దాక్కుని బయటకు రావడం తగ్గించింది. ప్లాంట్ లోపల ఉన్న సీసీ కెమెరాల్లో చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తే.. అటవీ అధికారులు .. ప్రయత్నాలు చేశారు. మెషిన్స్ మధ్యనే ఎక్కువగా తిరగడంతో.. పట్టుకోవడంలో ఆలస్యం ఆలస్యం అయింది. మెల్లగా ఎర వేసి.. చిరుతను.. హెటెరో ఫేజ్ టూలో ఉన్నఓ అద్దాల గతి వైపు మళ్లించారు. ఆ గతిలోకి వచ్చిన తర్వాత చిరుతకు ఎలా బయటకు వెళ్లాలో మార్గం కనిపించకుండా చేశారు.
మేకపిల్లను ఎరగా వేసి మత్తు ఇంజక్షన్
అద్దాల గతిలో చిరుత హంగామా చేసింది. మెషిన్ల మధ్య పరుగులు పెట్టింది. ఎటు నుంచి అయినా వెళ్లిపోదామని ట్రై చేసింది. అయితే ఈ సమయంలో జూ అధికారులు మేకపిల్లను ఎరగా వేశారు. మత్తు ఇంజక్షన్ ను గురి చూసి ఇచ్చారు. రెండు మూడు సార్లు విఫలమైనా చివరికి ఆ ఇంజక్షన్ చిరుతకు గుచ్చుకోవడంతో.. మత్తులోకి వెళ్లిపోయింది. తర్వాత దాన్ని జూకు తరలించారు. అక్కడే చిరుతకు ప్రాధమిక పరీక్షలు నిర్వహించారు. గాయాలేమీ కాలేదని నిర్దారించుకున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు చేసి.. గాయాలైతే జూలోనే వైద్యం అందించనున్నారు.
ఫ్యాక్టరీలోకి ఎవరినీ పంపకుండా ఆపరేషన్ !
హెటెరో ఫ్యాక్టరీ హెచ్ బ్లాక్ లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిరుత తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. గత మూడు నెలల క్రితం కూడా సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాకు లభ్యమయ్యాయి. దీంతో అక్కడే ఉందని నిర్ధారించుకున్న ఫ్యాక్టరీ అధికారులు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమయిన అటవీ శాఖ సిబ్బంది.. 45 మంది అటవీ శాఖ జు అధికారులతో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పులుల కంటే చిరుతలు ఎంతో చెలాకీగా ఉంటాయి. అందువల్ల వాటిని పట్టుకోవడం అంత తేలిక కాదు.అయితే కాస్త అలస్యమైనా చిరుత దొరకడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సమీప అడవుల నుంచి పరిశ్రమలోకి వచ్చి ఉంటుందా ?
హెటెరో పరిశ్రమకు దగ్గర్లోనే అడవులున్నాయి. అందువల్ల చిరుత పులి అడవి నుంచి ఇలా వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు, పులుల సంచారం కలకలం రేపుతోంది. చాలా చోట్ల పులులు కనిపిస్తున్నాయి. బయట దాడులు చేస్తున్నాయి. పసుశులను చంపుతున్నాయి. అయితే.. చిక్కడం లేదు. తప్పించుకుని వెళ్తున్నాయి. ఏపీతో పాటు ఇటీవల ఆదిలాబాద్ అడవుల్లోనూ ఇలా పులుల సంచారం ఎక్కువగా ఉంది. వాటిని పట్టుకునే ప్రయత్నాలు ఫెయిలవుతున్నాయి. ఇప్పుడు హెటెరో చొరబడిన చిరుతను మాత్రం వెంటనే పట్టుకోగలిగారు.