Indervelli: కాళ్లు, చేతులు నరికి పంపిస్తా, జాగ్రత్త.. రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
ఇంద్రవెల్లి సభలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు విపరీతంగా స్పందిస్తున్నారు. రేవంత్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.
దళిత, గిరిజన దండోరా యాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ రాజకీయ పరంగా బాగా వేడి రగిలిస్తోంది. అందులో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు విపరీతంగా స్పందిస్తున్నారు.
ఇంద్రవెల్లి సభ రేవంత్‌రెడ్డి తన సరదా తీర్చుకున్నారే తప్ప దళితులకు, గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి. ఇంద్రవెల్లిలో 40ఏళ్ల క్రితమే ఆదివాసీలను కాంగ్రెస్ కాల్చి చంపిందని గుర్తుచేశారు ప్రశాంత్ రెడ్డి. ఏ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మాలని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ రేవంతా... టీడీపీ రేవంతా... బీజేపీ రేవంతా.. పూటకో పార్టీ మార్చే ఏ రేవంత్ రెడ్డిని కార్యకర్తలు విశ్వసించాలని నిలదీశారు. చంద్రబాబు మేనేజ్మెంట్‌తో పీసీపీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి నిజస్వరూపాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గ్రహించాలని సూచించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి
దళితులను కాంగ్రెస్ ప్రధానమంత్రిని చేసిందా అని ప్రశ్నించారు ప్రశాంత్‌రెడ్డి. దళితులను సీఎంలుగా చేసి ఎంతకాలం పదవిలో ఉంచిందని నిలదీశారు. కాంగ్రెస్ ఓ డ్రామా కంపెనీ అని... రేవంత్ ఓ డ్రామా ఆర్టిస్టు అని ఘాటైన విమర్శలు చేశారు మంత్రి. దమ్ముంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని సవాల్ చేశారు. రేవంత్ శాశ్వతంగా జైలుకు పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని... చివరి దశకు వచ్చిన కేసుల్లో శిక్ష తప్పదని హెచ్చరించారు ప్రశాంత్ రెడ్డి.
రేవంత్‌రెడ్డి భాష సరిగా లేదని విమర్శించారు మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తానంటూ తీవ్ర హెచ్చరికలు చేశారాయన. దళితబంధును బద్నాం చేసేందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్లు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇలాంటి విమర్శలు మళ్లీ మళ్లీ చేస్తే తాము కూడా నోటికి పని చెప్పాల్సి వస్తుందన్నారు టీఆర్‌ఎస్ నేతలు.
మాజీ మంత్రి జోగు రామన్న రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి సభ నిర్వహించారని జోగు రామన్న ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే కాళ్లు, చేతులు నరికి పంపిస్తామంటూ జోగు రామన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖబడ్దార్ రేవంత్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు, రైతు బంధు, రైతు భీమా లాంటి పథకాలేవీ లేవని, అప్పుడు పథకాలు పెట్టడం చేతకానివాళ్లు ఇక్కడేదో చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా ఇంద్రవెల్లి సభ జరిగిందని.. ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
Also Read: Huzurabad Effect: సారు.. జర మీరూ రిజైన్ చేయరాదుర్రి.. మాక్కూడా పైసలత్తే.. మంచిగుంటది
‘‘పగటి దొంగ రేవంత్‌కు తగిన శాస్తి జరుగుతుంది. దళిత, గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నాగోబా జాతరకు నిధులిచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. గతంలో గిరిజన, ఆదివాసీ పండగల సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీనే ఇపుడు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు’’ అని మాజి మంత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు.
దళిత దండోరా సభలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ పోరాటాల చరిత్రను టీఆర్ఎస్ మార్చివేసిందని, ఇప్పుడు ఆదిలాబాద్ అంటే జోకుడు రామన్న, గుడులను గుడిలో లింగాన్ని మింగుతున్న ఇంద్ర కరణ్ రెడ్డి, బానిస సుమన్ అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని రేవంత్ అన్నారు. బానిస సంకెళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. ఉద్యమాలకు ఊపిరిలూదిన కొమ్రం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని రేవంత్ గుర్తు చేశారు.