Huzurabad Effect: సారు.. జర మీరూ రిజైన్ చేయరాదుర్రి.. మాక్కూడా పైసలత్తే.. మంచిగుంటది
ఓ సారూ.. జరంతా మీరు బంద్ చేయరాదుర్రి.. గింతంత పుణ్యముంటంది. అగో గా సారు జేశిండు. అక్కడొళ్లకు మస్తు పైసలిత్తుర్రు. మాకూ కావాలే. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో గిదే ముచ్చట.
గా.. హుజూరాబాద్ ల సారు రాజీనామా జేశిండట. గట్లనే మా సారు జేస్తే.. మంచిగుండు. మాక్కుడా పైసలత్తుండే. గా పథకాలో.. గిథకాలో.. ఏవో ఒకటి పెడుతుండే. గట్లనైనా మాకు పాణం జరంత నిమ్మలం అయితుండే. ఇప్పుడు ఏడ సూశినా ఇగో గిదే ముచ్చట. ఈటల రాజీనామా చేసి చాలా దినాలైనా.. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ముచ్చట. జనాలు మా సారు రాజీనామా జేస్తే మంచిగుండు. మా సారు బంద్ జేస్తే జర మస్తుండు. గిదే ఆలోచన. గల్లకు అచ్చినట్టే మాకు పైసలు వస్తుండేనని.
ఆడా.. ఇడా అని.. ఏం లే. తెలంగాణలోని చానా నియోజకవర్గల్లో జనాల నోట్లే అదే ముచ్చట. మా సారు రాజీనామా జేస్తే మస్తుంటది.. మా సారు ఇంకా చెత్తలేడేందని. మా ఎమ్మెల్యే రాజీనామా జేస్తే.. మా బతుకులు మారతాయి అని ఒకరంటే.. చేస్తే అన్నీ అమలవుతాయని మరికొందరు ముచ్చట చెప్పుకొస్తుర్రు. ఏమైనా ఈటల రాజేందర్ రాజీనామా చానా మందికి.. తలనొప్పి అయినట్టు కొడ్తంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని ఏం లేదు. ఏ ఎమ్మెల్యే పోయిన గంతే. ఓ సారు జర మీరు కూడా రాజీనామా జేయరాదుర్రేనని.
ఇగ కొంతమంది నేతల ముచ్చటైతే మరీ.. ఘోరం ఉన్నది. జనాలకు చెప్పలేక. తల పాణం తొకలోకి అత్తుంది. నువ్ ఆ సారుకు దగ్గరనేగా.. చేపియరాదుర్రి సారుతో రాజీనామా. ఏం అయితది.. మల్ల ఓటేసి గెలిపిత్తం గదా. ఇగో గిదే కథ. జనాలకు సమాధానం చెప్పలేక.. కిందిస్థాయి నేతలకైతే.. మస్తు ఇబ్బందులైతానయట.
అన్ని చోట్లా... గా హుజూరాబద్ ఎఫెక్టే పడినట్టు కొడ్తంది. ఎమ్మెల్యే సారు రిజైన్ చెస్తే.. ఉపఎన్నిక అత్తది. ఉపఎన్నిక అత్తే.. వరాల వాన పడ్తది. పథకాల సునామీ అత్తది. బతుకులు మారిపోతాయి. జనంలో గిదే ఆశ. తెలంగాణలోని చానా నియోజవర్గల్లోని జనం ఫీలింగ్ గదే.
హుజూరాబాద్ లో దళిత బంధు అన్నప్పటి నుంచి.. లొల్లి స్టార్టైంది. దళితుల ఇంట్లకు పైసలు. మల్లోదిక్కు.. గొర్రెల పంపిణీ, ఇంకో దిక్కు.. వేరే పథకాలు. గిట్లుంటే.. జనంకు ఆశ పుడ్తతి కదా. గదే అయింది. కొన్ని నియోజవర్గాల్లోనైతే.. ఏకంగా ఎమ్మెల్యేనే రాజీనామా జేయాలని ఎంటవడ్డరు జనం. ప్లెక్సీలు ఏశీ మరి. సారు రిజైన్ జేయరాదు అని అడిగిన కథ కూడా మనం చూసినం. ఏదో ఉపఎన్నిక అత్తే బాగుపడతాం అనే జనం ఆశ. ఎట్లైతే ఏందీ పైసలు రావాలే అనేగా కోరుకునేది. మాకు ఎరికే మా సారు మాకోసం చేసినా.. జెత్తడు అని కొంతమంది జనం నమ్ముతుర్రు కూడా.
అయితే గిదే విషయంపై 'ఏబీపీ దేశం'.. హుజూరాబాద్ పక్కనే ఉన్న.. పెద్దపల్లి నియోజకవర్గంలో అడిగింది. అక్కడ కొంతమందితో ముచ్చట పెట్టింది. వాళ్లు అదే సంగతి చెబుతుర్రు. మా సారు మంచిగ పని జెత్తండ.. లేక చెత్తలేడా అని మాకు అవసరంలే. గిప్పటికి గిప్పుడు రాజీనామా జెత్తే.. గా రాజేందర్ సార్ ఇలాఖాలో అచ్చినట్టు పైసలత్తయి. కేసీఆర్ సారు ఇప్పిత్తాడు అనే నమ్మకం అయితే మాకున్నది. వాళ్ల రాజకీయం వాళ్లు చేసుకుంటే మనకేమున్నది. మనకు గట్లనైనా పైసలు అత్తాయి కదా అని చెప్పుకొత్తురు. ఎలా అయినా.. ఈటల రాజీనామా జెర గట్టిగనే.. జనాల్లోకి వెళ్లింది. గందుకే గక్కడ జెశినట్లు మా దగ్గర జేయమని జనాలు ఒకటే లొల్లి.
మరో దిక్కు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి గదే విషయంపై మాట్లాడిండు. నేను రిజైన్ జెత్తా. మా నియోజకవర్గన్ని అభివృద్ధి జేయండని. 2 వేల కోట్లు ఇయ్యిర్రి. నేను గిప్పుడే రిజైన్ జేసి పడెత్తా.. అని సవాల్ కూడా కొట్టిండు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే.. రాజాసింగ్ కూడా అదే మాట అన్నడు. నా నియోజకవర్గాన్ని డెవలప్ చేత్తా.. అంటే నేనూ రాజీనామాకు సిద్ధమేనని ప్రకటన ఇడిశిపెట్టిండు. కేసీఆర్ నిధులు వదిలిన ఎంటనే.. సెకను ఆగకుంటా.. రాజీనామా చేసేస్తానని చెప్పుకొచ్చిండు.