(Source: ECI/ABP News/ABP Majha)
Etala rajender: పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ - ఈటల రాజేందర్ క్లారిటీ
Etala rajender: మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాలన్న తన కోరికను ఈటల రాజేందర్ బహిరంగంగా వ్యక్తం చేశారు. అయితే పార్టీ ఆదేశించాలని ఆయన అంటున్నారు.
Etala rajender: మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలన్న తన కోరికను ఈటల రాజేందర్ బహిరంగంగానే వ్యక్తం చేసారు. బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమేనని ఈటల స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టులో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎలాంటి లాభం ఉండదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంతోనే దేశంలో అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. మోదీ హయాంలో భారత్ లో సమూలమార్పులు తీసుకొచ్చారని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు మార్పుకోరుకున్నారని ఈటల తెలిపారు. అందుకే కాంగ్రెస్ అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓడిపోయిన అభ్యర్థులు అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అహంకార పాలనకు ఇదే నిదర్శనమని విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, కిషన్ రెడ్డి ఓడిపోయారు. కానీ ఆ తర్వతా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు పోటీ చేశారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. ఇప్పుడు ఇదే బాటలో ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఈటల.. ఇప్పుడు లోకసభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. బీజేపీకి కాస్త కూస్తో పట్టున్న హైదారాబాద్ ను వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. మహానగరంలో పరిధిలోని మల్కాజ్ గిరి నుంచి బరిలోకి దిగాలని తన మనసులో మాటను బయటపెట్టారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన టిక్కెట్ అడుగుతున్నారు. కానీ హైకమాండ్ ఏదీ తేల్చడం లేదు. ఈటల రాజేందర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మల్కాజ్‌గిరిలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ కార్యక్రమాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అధిష్టానానికి సంకేతాన్ని పంపుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఈటల ఫర్ మల్కాజ్‌గిరి’ క్రికెట్ ట్రోఫీని ఆయన అనుచరులు స్టార్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా స్వయంగా తన నివాసంలో ఈటల రాజేందర్ రిలీజ్ చేశారు.
ఎంపీగా పోటీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం కంటే ముందే అనుచరుల పేరుతో తానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై పార్టీ నేతలు హైకమండ్ కు పిర్యాదులు చేశారు. ఇప్పటికి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినా పార్టీ పరిస్థితి మెరుగుపడలేదు. ఈటల సూచనల మేరకే బీసీ సీఎం నినాదాన్ని అందుకున్నారని కూడా అంటున్నారు. అయితే బీసీసీ సీఎం నినాదం ఇచ్చినా ఎల్పీ నేతగా మళ్లీ రెడ్డి వర్గానికే పదవి ఇచ్చారు. దీనిపైనా ఈటల అసంతృప్తి గా ఉన్నారంటున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యి చాలా సేపు చర్చలు జరపడంతో త్వరలో ఆయన కమలం పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చర్చ జోరందుకుంది. కానీ అది ఓ కార్పొరేటర్ గృహప్రవేశ కార్యక్రమంలో దిగిన ఫోటో అని.. పార్టీ మార్పుపై తప్పుడు ప్రచారమని ఈటల స్పష్టం చేశారు.