Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మూడో చార్జిషీట్ - అందులో ఏముందంటే ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మూడో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఎమ్మెల్సీ కవిత ఆర్థిక లావాదేవీలపై పలు ఆరోపణలు చేశారు.
Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడో చార్జిషీటు దాఖలు చేసింది. మనీలాండరింగ్, హవాలా వ్యవహారాల్లో కల్వకుంట్ల కవిత కీలకమని పేర్కొంది. మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కవిత సమావేశమయ్యారని వెల్లడించింది. అరుణ్ పిళ్లైకి కవితనే డబ్బు సమకూర్చినట్లు ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్‌లో కవిత ప్రతినిధిగా పిళ్లై, రాఘవ ప్రతినిధిగా ప్రేమ్ మండూరి వ్యవహరించారని చెప్పింది. అరుణ్ పిళ్లైకి కవితనే డబ్బు సమకూర్చారని తెలిపింది. మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రూ.192 కోట్లతో హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేశారని ఈడీ చార్జిషీట్‌లో తెలిపింది.
ఢిల్లీ మద్యం వ్యాపారం లాభాలతో హైదరాబాద్‌లో భూములు
హైదరాబాద్ లో మూడు స్థలాలను కవిత కొనుగోలు చేశారని.. తమకు ఉన్న పలుకుబడితో తక్కువ ధరకే వాటిని కొనుగోలు చేసినట్లుగా ఈడీ చార్జిషీట్‌లో తెలిపింది. చార్జిషీట్లో కవిత భర్త అనిల్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది. చార్జిషీట్‌లో కవిత సన్నిహితులంటూ కొంత మంది పేర్లను చేర్చిది. చార్జి షీట్ లో ఫినిక్స్ శ్రీహరి పేరు కూడా ఉంది. ఆయన భూములు కొనడంలో సహకరించారని ఈడీ తెలిపింది. అలాగే వి. శ్రీనివాస రావు, సృజన్ రెడ్డి పేర్లను చేర్చింది ఈడీ. ఇండో స్పిరిట్ కు తన వాటాను అరుణ్ పిళ్లై ద్వారా కవితనే డబ్బులు ఇచ్చినట్లు పేర్కొంది.
కవిత బినామీగా అరుణ్ పిళ్లై
కవిత బినామీ అని ఈడీ ఆరోపిస్తున్ న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మార్చి 6న అరెస్ట్ చేసింది. కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని.. ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ. కవిత విచారణ సమయంలోనే తన ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా ఇటీవల సీబీఐ విచారించింది. ఇటీవలే 9 గంటల పాటు సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
కాలికి గాయంతో రెస్ట్ తీసుకుంటున్న కవిత
ఏప్రిల్ పదో తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయినట్లుగా నిర్ధారణ కావడంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చి మొదటి ఉద్యమంగా మహిళా రిజర్వేషన్ అంశాన్ని తీసుకున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి కార్యాచరణలో భాగంగా మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించనున్నారు. ఈ నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. గాయం కారణంగా అవన్నీ వాయిదా పడ్డాయి. మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెను మరోసారి విచారణకు ఈడీ కానీ సీబీఐ కానీ పిలువలేదు.