Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Telangana News: తెలంగాణలో మరోసారి భూకంపం ఆందోళన కలిగించింది. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
Earthquake In Mahabubnagar: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో (Mahabubnagar) శనివారం మధ్యాహ్నం స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12:15 గంటలకు కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా కొద్ది సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతం, జూరాల ప్రాజెక్టుకు ఎగువ, దిగువ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కాగా, ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ఈ నెల 4న ఉదయం 7:27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
3 రోజుల క్రితం ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైనట్లు హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ - ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో భూకంప తీవ్రత కనిపించింది. భాగ్యనగర పరిధిలో వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాపై భూకంప ప్రభావం తీవ్రంగా కనిపించింది. ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ములుగు నుంచి 50 కి.మీ ఈశాన్యం వైపు ఏటూరునాగరం భూకంప కేంద్రంలో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5గా ఉందని అధికారులు తెలిపారు. భూకంపాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు మూడో జోన్ కిందకు వస్తాయని.. గతంలో 1969, 2018లో కొత్తగూడెం, భద్రాచలంలో భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పారు.
గడిచిన 50 ఏళ్లలో..
తెలంగాణలో గడిచిన 50 ఏళ్లలో ఈ నెల 4న వచ్చిందే అతిపెద్ద భూకంపం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌కు ౩౦౦ కిలోమీటర్ల దూరంలోని మహరాష్ట్ర లాతూరులో సమీపంలో ఆసాలో 6.2 మాగ్నిట్యూడ్‌తో 1993లో భారీ భూకంపం వచ్చింది. అప్పట్లో 8 వేల మందికిపైగా చనిపోయారు. గడచిన ౩౦ ఏళ్లలో హైదరాబాద్ సమీపంలో ఇదే అతి పెద్ద భూకంపం. 1993 సెప్టెంబర్ 30న తెల్లవారుజామున 3:55 గంటలకు వచ్చిన భూకంపం చుట్టుపక్కల ప్రాంతాలను వణికించింది. ఇది గత 124 ఏళ్లలో హైదరాబాద్ సమీపంలో సంభవించిన అత్యంత బలమైన భూకంపం. 2020 ఏప్రిల్ 24న ఆసిఫాబాద్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని తర్వాత మహారాష్ట్రకు చెందిన బాస్మత్‌లో 4.6 తీవ్రతతో 2024 మార్చిలో భూకంపం సంభవించింది. కాగా, భూ ప్రకంపనలపై తెలంగాణ విపత్త నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చారు. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉంటే ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ అతి తక్కువ స్థాయి భూకంపాలు సంభవించే జోన్ 2లో ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read: Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!