Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
Telangana News | సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలైంది. విగ్రహ ఆవిష్కరణను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు.
Pil against Telangana Talli Statue Unveil On 9th December | హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం కొనసాగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. విగ్రహం రూపంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూలూరు గౌరీశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. సచివాలయంలో విగ్రహ ప్రతిష్ట నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని జూలూరు గౌరీశంకర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రజల మనోభావాలు దిబ్బతింటాయి
తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడంతో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిల్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన రోజు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించింది.
అచ్చమైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా మన తెలంగాణ తల్లి విగ్రహం ఉందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, రాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను సూచించే పాత విగ్రహాన్ని మార్చి, కాంగ్రెస్ తల్లి విగ్రహం పెడుతున్నట్లుగా ఉందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణ తల్లి చిత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతీకగా చూపేట్లుగా రూపొందించబడింది.
— Baddam Mitra reddy (@BaddamMitra) December 6, 2024
"తెలంగాణ తల్లి" చిత్రంలో ఒక మహిళా ప్రతిమ ఉంది. ఆమె ఒక ఆధునిక భారతీయ స్త్రీ వేషంలో ఉంటుంది, ఆమె చేతల్లో వివిధ రకాల పంటల గింజలు మరియు పండ్లు ఉన్నాయి, ఇవి తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యవసాయ సంపదను… pic.twitter.com/flGNGHv82O
ప్రభుత్వం ఏం చెబుతోందంటే..
అచ్చమైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. అందులో మీరు ఈ లక్షణాలు గుర్తించాలి 1. తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వదనంతో ఉండే నిండు రూపం. 2. చూడగానే తెలంగాణ తల్లి మన ఇంటి ఆడబిడ్డ అవతారం ఎత్తినట్లుగా కనిపించే ముఖం. 3. మెడలో బంగారు తీగ - ఎన్ని ఆభరణాలున్నా, తెలంగాణ ఆడబిడ్డలు మెడలో ఈ తీగను తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా, ఎంతో ఇష్టంగా ధరిస్తారు. 4. కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ, ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను ధరించి, రాష్ట్రంలో వ్యవసాయానికి గల ప్రాముఖ్యతను చాటి చెబుతుంది.
5. తెలంగాణ గ్రామీణ జీవన విధాన ప్రాముఖ్యతను, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మూల స్తంభమైన వ్యవసాయంలో ఆడబిడ్డల ప్రాముఖ్యతను చాటుతోంది 6. వస్త్రధారణలోని ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మలాంటి తెలంగాణ ధీర వనితల పోరాటానికి సంకేతం. 7. తెలంగాణ తల్లిని బిడ్డలందరూ తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నట్లుగా తెలిపే విగ్రహ పీఠం. 8. విగ్రహ పీఠంలో, తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన తెలంగాణ బిడ్డల పోరాటాలకు ప్రతీకగా బిగిసిన పిడికిళ్లు. 9. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం.