Hyderabad News: షాకింగ్ ఘటన - రిమాండ్ ఖైదీ కడుపులో మేకులు, శ్రమించి బయటకు తీసిన వైద్యులు
Telangana News: ఓ రిమాండ్ ఖైదీ ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కడుపు నొప్పితో బాధ పడుతుండగా.. వైద్యులు చికిత్స అందించి అతని ప్రాణాలు కాపాడారు.
Doctors Remove Nails From Charlapally Jail Prisoner: కడుపునొప్పితో విలవిల్లాడిన ఓ రిమాండ్ ఖైదీని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతని కడుపులో మేకులను గుర్తించి షాక్ అయ్యారు. అనంతరం శ్రమించి ఎండోస్కోపి ద్వారా మేకులను తొలగించి ఖైదీ ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) చర్లపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని చర్లపల్లి జైలులో మహ్మద్ షేక్ (32) అనే వ్యక్తి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతుండగా.. జైలు వైద్యుల సిఫార్సు మేరకు అధికారులు అతన్ని గాంధీ ఆస్పత్రి ఖైదీల వార్డులో చేర్పించారు. అక్కడి డాక్టర్లు ఎక్స్ రేలు తీయించి పరిశీలించగా ఖైదీ కడుపులో మేకులు ఉన్నట్లు గుర్తించారు. ఏకంగా 9 మేకులను గుర్తించి షాక్ అయ్యారు. గ్యాస్టో ఎంటరాలజీ విభాగాధిపతి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో శనివారం మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి.. రోగి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి ఎండోస్కోపి ద్వారా 9 మేకులను విజయవంతంగా బయటకు తీశారు. సుమారు 2 - 2.5 అంగుళాలు ఉండే ఈ మేకులను రోగి కావాలనే మింగాడని.. అందుకు గల కారణాలను ఆరా తీస్తున్నామని జైలు అధికారులు తెలిపారు.
Also Read: Stone Attack: రాయి దాడి కేసులో కీలక పరిణామం, టీడీపీ నేతను విడిచిపెట్టిన పోలీసులు