Telangana: ఒక్క DA ఇచ్చి దీపావళి కానుక అనడం దారుణమే, ఎన్నికల హామీలు నెరవేర్చండి: దేవిప్రసాద్
Telangana Employees | తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని, అది కూడా బీఆర్ఎస్ ఆమోదించిన డీఏ అని దేవి ప్రసాద్ మండిపడ్డారు.
Devi Prasad Demands for pending DAs to Govt Employees in Telangana | హైదరాబాద్: ఉద్యోగులకు కేవలం ఒక్క విడుత కరువు భత్యం (DA) విడుదల చేస్తామని చెప్పి దీపావళి కానుకగా చిత్రీకరించండం హాస్యాస్పదమని ఉద్యోగసంఘాల జాక్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ అన్నారు. రెండు జాక్ లతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 3 డీఏలు చెల్లిస్తారని ఉద్యోగులు భావించారు. కానీ తెలంగాణ కేబినెట్ కేవలం ఒక్క డీఏ విడుదల చేయడం ఉద్యోగులను అవమానించడమే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించి అనుమతి కోసం ఎన్నికల కమిషన్ (Election Commission)కు పంపించిన జూలై 22 నుండి రావలిసిన DA ను విడుదల చేసి ఉద్యోగులు సంతృప్తి చెందాలని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నిర్ణయం ఉద్యోగులపట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి ఏమిటో నిరూపించింది.
పీఆర్సీ జాడ కనుచూపు మేరలో కూడా లేదు
ఎన్నికల మేనిఫెస్టో లో పెండింగ్ లో ఉన్న డీఏలు తక్షణం చెల్లిస్తామని చెప్పి 10 నెలల తర్వాత కేవలం ఒక్క డీఏ విడుదల చేయడం సరికాదని దేవి ప్రసాద్ అన్నారు. మిగత 4 డీఏలు ఎప్పడు చెల్లిస్తారు, 6 నెలల లోపు పీఆర్సీ అమలు చేస్తామని.. మరో ఆరు నెలలు పీఆర్సీ గడువు పొడగించారు. అంటే కనుచూపు మేరలో పీఆర్సీ జాడ కూడా లేదన్నారు. హెల్త్ కార్డ్స్, 317, సీపీఎస్, లాంటి సమస్యల పై సబ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. వివిధ సమస్యలపై ఇప్పటికే 20 సబ్ కమిటీలు ఏర్పాటు చేసినా ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదు. మార్చ్ 24 నుంచి దాదాపు 6 వేల మంది ఉద్యోగులు రిటైరయ్యారు. వారికి రావాల్సిన గ్రాట్యుటీ, ఎన్ క్యాషమెంట్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ చెల్లించకుండా వేధిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఉండే ఆర్థిక బాధల నుండి విముక్తి కలుగుతుందని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోందన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా, అంగన్వాడీ ఐకేపీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత ఇస్తామని ఎన్నికల హామీలిచ్చారు. 317 జీవో పై అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పుడు స్థానికతతో ముడిపడిన సమస్య అని దాటవేస్తున్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే ధర్నాలు చేయడం, నిరసనలు తెలపడం ప్రజాస్వామిక హక్కు అని ఇటీవల జాక్ తో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఉద్యోగులు పనిభారం తగ్గింపు, అవసరమైన సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని అడిగినందుకు జాక్ తో చర్చల సమయంలోనే 166 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం నోటితో పొగిడి నొసటితో వెక్కిరించమే అన్నారు.
ఉద్యోగులను సస్పెండ్ చేయంపై ఆగ్రహం
స్పెషల్ పోలీస్ ఉద్యోగుల కుటుంబాలు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినందుకు 39 మందిని సిస్పెండ్ చేసి ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రేమను చూపిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి. సస్పెండ్ అయిన ఉద్యోగులను తిరిగి విధులలో తీసుకోవాలి. ఆదాయం పెరిగిందంటారు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా ఉద్యోగులను మోసం చేసే కుట్ర అని ఉద్యోగసంఘాల జాక్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ పేర్కొన్నారు.
Also Read: Drugs Party: రాజ్ పాకాల జన్వాడ ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ, టెస్టులు చేపించగా పాజిటివ్