Water Falls: బొగత, కుంటాల అభివృద్ధికి బ్రేక్ - భూమి ఇచ్చేందుకు అటవీ శాఖ అనుమతి నిరాకరణ
Water Falls: బొగత, కుంటాల జలపాతాల వద్ద సస్పెన్షన్ వంతెనల నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు అటవీ శాఖ నిరాకరించింది. దీంతో ప్రతిపాదిత ప్రాజెక్టుల్ని పర్యాటకాభివృద్ధి సంస్థ విరమించుకుంది.
బొగత, కుంటాల జలపాతం అందాల్ని అతి దగ్గరి నుంచి వీక్షించాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఇలా వీక్షించేందుకు ఆయా జలపాతాల వద్ద వంతెనల నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు అటవీ శాఖ అనుమతి నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక్క అంగుళం స్థలం కూడా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ ప్రాజెక్టులను విరమించుకుంది.
పర్యాటకాభివృద్ధి కోసం ప్రతిపాదనలివే
తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత, ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాలు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ 2 జలపాతాల సందర్శనకు వర్షాకాలంలో పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. ఈ క్రమంలో జలపాతాల అందాల్ని అతి దగ్గరి నుంచి వీక్షించేలా సస్పెన్షన్ వంతెనలు నిర్మించేందుకు పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక్కో చోట 25 గజాల స్థలం ఇవ్వాలని అటవీ శాఖకు లేఖ రాసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఒక్క అంగుళం స్థలం కూడా ఇవ్వలేమని అటవీ శాఖ స్పష్టం చేసింది. డెండర్లు పిలవానుకునే సమయంలో అటవీ శాఖ నిర్ణయంతో పర్యాటకాభివృద్ధి సంస్థ ఆ ప్రాజెక్టులను విరమించుకుంది.
కారణాలివే
పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ జలపాతాలను అతి దగ్గరి నుంచి వీక్షించేలా ఈ వంతెనలు నిర్మించాలనుకున్నట్లు టూరిజం కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. కోర్ ఏరియా కావడంతో కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా భూమి ఇవ్వలేమని అటవీ శాఖ స్పష్టం చేసినట్లు టూరిజం అధికారులు పేర్కొన్నారు. దీంతో టెండర్ల ప్రక్రియ పక్కన పెట్టినట్లు చెప్పారు. ఈ 2 జలపాతాలు ఉన్నది అటవీ ప్రాంతంలోనే కావడంతో పర్యాటకుల రాకపోకల్ని, వాహనాల్ని ఆ శాఖ అనుమతిస్తోంది. అయితే, భూమి ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. అటవీ సంరక్షణ చట్టాన్ని పాటించాల్సిందేనని, అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు.