Revanth Reddy on BJP: తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, ఎమ్మెల్యేల కొనుగోలుపై రేవంత్ రెడ్డి సెటైర్లు!
Revanth Reddy on BJP: తొందరపడి ఒక కోయిల ముందే కూసంది అంటూ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై కామెంట్లు చేశారు.
Revanth Reddy on BJP: మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన యత్నంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తమతోపాటు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్ లు ఉన్నారంటూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు మీడియాతో మాట్లాడిన వీడియోను బుధవారం ఆయన ట్యాగ్ చేశారు. ఆ "పార్టీ కొనుగోళ్లపై" తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నాలుగు జిల్లాల నుంచి ఇద్దరేసి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈ వీడియోలో రఘునందన్ రావు తెలిపారు. అలాగే కండువా కప్పుకొని పక్కన కూర్చోగానే టీఆర్ఎస్ నేతలు అనుకోవద్దని అన్నారు. తామే వాళ్లను టీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి పంపి ఉండవచ్చు కదా అంటూ కామెంట్లు చేశారు. అంతే కాదండోయ్ మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని వివరించారు.
ఆ పార్టీ “కొనుగోళ్ళ” పై తొందరపడి ఒక కోయిల ముందే కూసింది… pic.twitter.com/47GnjyOU5X
— Revanth Reddy (@revanth_anumula) October 26, 2022
ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ జాతీయ పార్టీ ప్రయత్నించిందన్న వార్తలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. మునుగోడు ఓటమి గ్రహించిన కేసీఆర్ కొత్త ఎత్తుగడతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. మర్రిగూడ మండలంలోని తిరుగండ్ల పల్లి నుంచి మాట్లాడిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
టీఆర్‌ఎస్ ఓ పెద్ద డ్రామా కంపెనీ అంటూ దుయ్యబట్టారు బండి సంజయ్. నిజంగా ఇప్పుడు జరిగింది నిజమని కేసీఆర్ నమ్మితే... యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధపడాలని సవాల్ చేశారు. బీజేపీ తరఫున తాను ఒక్కడినే వస్తానని... కేసీఆర్ ఎప్పుడు టైం తీసుకొని రెడీ అంటే తాము సిద్ధమన్నారు. ఇలాంటి చిల్లర నాటకాలకు కాలం చెల్లిందని.. తెలంగాణ సమాజం ఇలాంటివి నమ్మే పరిస్థితి లేదన్నారు బండి.
చిల్లర రాజకీయాలకు పరాకాష్ట..
అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని జరుగుతున్న వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అంటున్నారు. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. సీఎం కేసీఆర్ చిల్లర రాజీయాలకు ఇది పరాకాష్ట అని ఒక ప్రకటనలో మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు బీజేపీ నేతలు వచ్చారంటూ కేసీఆర్ ఒక సినిమా కథను సృష్టించారని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతుందని ముందే తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఓటర్ల దృష్టిని మల్లించేందుకు డ్రామా ఆడుతున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కథ అల్లారన్నారు. బుధవారం రాత్రి ఆయన మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.