Viral News: నోరు లేని కుక్కపై అభాండాలు - యజమానిని చంపలేదు..కాపాడే ప్రయత్నం చేసింది !
Good Dog: హైదరాబాద్ లో పవన్ కుమార్ అనే వ్యక్తిని కుక్క చంపలేదని నిర్దారణ అయింది. పైగా కాపాడే ప్రయత్నం చేసిందని గుర్తించారు.

Hyderabad Dog: హైదరాబాద్ మధురానగర్‌లో పెంపుడు శునకం తన యజమాని ప్రైవేటు పార్టుల్లో కరిచి చంపేసిందని జరిగిన ప్రచారం అంతా ఉత్తదేనని వైద్యులు తేల్చారు. కుక్క కరవడం వల్ల మరణం సంభవించలేదని పరీక్షల్లో తేల్చారు. దీంతో యజమానిని చంపిన కుక్క అంటూ ఉదయం నుంచి అదే పనిగా ఆ కుక్కపై అభాండాలు వేశారు.నిజానికి ఆ కుక్క పవన్ ను కాపాడాలని ప్రయత్నించిందని గుర్తించారు.
ఇంట్లో చనిపోయిన పవన్ కుమార్ అనే యువకుడు
హైదరాబాద్‌లోని మధురానగర్ లో నివాసం ఉండే పవన్ కుమార్ ఒంటరిగా ఉంటున్నారు. తోడుగా ఆయన ఓ విదేశీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. పవన్ కుమార్ కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయనకు శ్వాస కోశ సమస్య ఉంది. అలా నిన్న రాత్రి ఆయనకు శ్వాస సమస్య వచ్చింది. ఆ సమయంలో కుక్క కూడా అక్కడే ఉంది. శ్వాస సమస్యతో అతను పెనుగులాడుతూంటే.. ఆ కుక్కకు ఏం చేయాలో కాక అతన్ని కాళ్లతో రక్కింది. కిందపడిపోయిన తర్వాత ఓ పక్కకు లాగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అతనికి చిన్న గాయాలయ్యాయి. దురదృష్టవశాత్తూ అతను చనిపోయాడు.
పెంపుడు కుక్కే చంపేసిందని ప్రచారం
దీంతో ఆ కుక్కకు ఏం చేయాలో అర్థం కాలేదు. అతని పక్కనే కూర్చుండిపోయింది. ఉదయమే పవన్ కుమార్ స్నేహితుడు వచ్చి .. తలుపులు కొట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికి వచ్చాడు. పవన్ కుమార్ చనిపోయి ఉండటం.. కుక్కకు కొద్దిగా రక్తపు మరకలు కనిపించడంతో కుక్క చంపేసిందని అనుకున్నారు. అదే విస్తృతంగా మీడియాలో ప్రచారం చేశారు. కానీ ఆ కుక్క కు తన యజమానికి ఏమైందో తెలియక దీనంగా చూస్తూ ఉండిపోయింది. దాన్ని బోనులో బంధించి పెట్టారు.
అనారోగ్యం కారణంగా చనిపోయిన పవన్ కుమార్
చివరికి వైద్యులు కుక్క కరవడం వల్ల లేదా.. కుక్క ప్రైవేటు పార్టుల్ని కొరకడం వల్ల చనిపోలేదని.. శ్వాస కోశ సమస్యతో చనిపోయాడని పోస్టుమార్టం చేసి నిర్దారించారు. అదే కుక్కకు నోరు లేకపోవడం వల్ల యజమానిని చంపేసిన నింద సులువుగా దానిపై వేసేశారని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ మనిషిపై అలాంటి నింద వేస్తే..ఎలా తట్టుకుంటారోనని ప్రశ్నిస్తున్నారు. ఏమీ నిర్దారణ కాకుండా ప్రచారం చేయడం మంచిది కాదని అంటున్నారు.
పవన్ కుమార్ కు గతంలో పెళ్లి అయినా.. భార్యతో విబేధాలు రావడంతో ఒంటరిగా ఉంటున్నారు. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటున్నారు. మరో స్నేహితుడితో కలిసి అపార్టుమెంట్ లో ఉంటున్నారు. భార్య, పిల్లలు లేకపోవడంతో కుక్కను పెంచుకుంటున్నారు.





















