Revanth Reddy: తెలంగాణలో రెండు అమానుష ఘటనలు - సీఎం రేవంత్ సీరియస్, డీజీపీకి కీలక ఆదేశాలు
Telangana News: తెలంగాణలో రెండు నేర ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఓ ఘటనలో వెంటనే చర్యలకు ఆదేశించగా.. మరో ఘటనలో బాధితులకు భరోసా కల్పించారు.
Revanth Reddy News: తెలంగాణలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ క్రైమ్ ఘటనల పట్ల ముఖ్యమంత్రి చర్యలకు ఆదేశించారు. ఓ ఘటన నారాయణపేట జిల్లాలో జరగ్గా.. మరో ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై కూడా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.
డీజీపీకి ఆదేశాలు
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయి రేప్, హత్య ఘటనపై పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించారు. పోక్సో చట్టాన్ని, IPC చట్టాన్ని, వినియోగించి, ఫోరెన్సిక్ టూల్స్ ను సమర్థంగా వాడుకొని కేసును పకడ్బందీగా విచారణ చేసి అతి త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని నిర్దేశించారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని అన్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో జరిగిన మర్డర్ పై ఆరా తీసి పోలీసుల నిర్లక్ష్యం ఉంటే తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.