Kadiyam Srihari: 'ఇందిరమ్మ రాజ్యంలో ఇదేనా సంక్షేమం!' - కాంగ్రెస్ ప్రభుత్వంపై కడియం శ్రీహరి విమర్శలు
Telangana News: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గొప్పగా హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు.
BRS Mla Kadiyam Srihari Slams Congress Government: ఎన్నికల్లో దుష్ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసేలా ఈ ప్రభుత్వం యోచిస్తోందని ఇదేనా సంక్షేమం అంటూ నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మరిన్ని పథకాలు ప్రవేశ పెడతారని ప్రజలు భావించారని.. అయితే వారి ఆశలు అడియాశలే అయ్యాయని ఎద్దేవా చేశారు. ఉన్న పథకాలనే తొలగిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తెచ్చిన గృహలక్ష్మి పథకం రద్దు చేయడం వల్ల లక్షలాది మంది లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారని.. ఇప్పటికే కలెక్టర్లు వారికి అనుమతి పత్రాలు కూడా ఇచ్చారని అన్నారు. 'దళిత బంధు'కు నిధులు కేటాయించలేదని.. రైతు బంధు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఆదాయంపై అవగాహన లేకుండానే అడ్డగోలు హామీలు ఇచ్చారని విమర్శించారు. రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.2 లక్షల వరకూ మాఫీ చేస్తామని, దానిపైనే తొలి సంతకం అంటూ గొప్పగా చెప్పారని.. ఇప్పటివరకూ దీనిపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సీఎం వర్క్ చేస్తున్నారా.?'
రాష్ట్ర ప్రభుత్వం 'గృహలక్ష్మి' పథకం రద్దు చేయడం సమంజసం కాదని కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, గృహలక్ష్మి లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనైనా చేర్చాలని అన్నారు. లేదంటే ఆ పథకాన్ని అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 'ఖరీఫ్ వరి పంటకు బోనస్ ఇస్తామన్నారు. యాసంగికి కూడా ఇస్తారో లేదో తెలియదు. సీఎంకు ఎవరు బ్రీఫింగ్ ఇస్తున్నారో తెలియడం లేదు. ఆయన కనీసం వర్క్ చేయడం లేదనిపిస్తోంది. 6 గ్యారెంటీల్లో 13 హామీలున్నాయి. 2 హామీలు అమలు చేసి పత్రికా ప్రకటనలిస్తూ ప్రభుత్వం ప్రజా ధనం దుర్వినియోగం చేస్తోంది. నిరుద్యోగ భృతిపై కూడా మాట మార్చారు.' అంటూ మండిపడ్డారు.
త్వరలోనే ప్రజల ముందుకు కేసీఆర్
మరోవైపు, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Kcr) వచ్చే నెలలో తెలంగాణ భవన్ కు వచ్చి రోజూ కార్యకర్తలను కలుస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్షిస్తూనే, రాబోయే లోక్ సభ ఎన్నికల సన్నద్ధత, కార్యాచరణపై సన్నాహక సమావేశంలో చర్చించారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని హరీష్ రావు ఈ సందర్భంగా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని.. ఎవరూ అధైర్యపడొద్దని హరీష్ రావు పునరుద్ఘాటించారు. 'తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మన సత్తా ఏంటో చూపిద్దాం. పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా పని చేయాలి. మున్ముందు మంచి రోజులు వస్తాయి. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడుస్తుంది.' అని వెల్లడించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా.. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్లుగా నడుస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read: Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - మరిన్ని ప్రత్యేక రైళ్ల ప్రకటన, షెడ్యూల్ ఇదే