Tummala Nageshwar Rao: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, తల నరుక్కుంటా కానీ తల వంచను - తుమ్మల వ్యాఖ్యలు
ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నట్లుగా తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణను ప్రకటించారు. భారీ వాహన శ్రేణి నడుమ అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా ఆయన ఖమ్మం చేరుకున్న సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద శుక్రవారం ఉదయం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సుమారు వెయ్యి కార్లు, 2 వేల బైక్‌లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నట్లుగా తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తన జీవితం మొత్తం అంకితం చేశానని అన్నారు. ఈ ఎన్నికలు తనకు పెద్దగా అవసరం లేదని.. తన రాజకీయం పదవి కోసం కాదని అన్నారు. తన జిల్లా ప్రజల కోసమే అని అన్నారు. ఖమ్మం జిల్లా వాసుల రాజకీయ రుణం తీర్చుకోలేనిదని అన్నారు. తాను ఏనాడూ ఎవరి ముందు తలవంచబోనని, అలాంటి పరిస్థితి వస్తే తన తల నరుక్కుంటానని అన్నారు.
గోదావరి జలాలతో ప్రజల పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా గెలుస్తానని అన్నారు. కొంత మంది పరాన్నభుక్కులు కొన్ని ఎత్తులు వేయొచ్చని అన్నారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా. ఒక నేను రాజకీయాలలో ఉండబోనని సీఎం కేసీఆర్ కు కూడా చెప్పాను. కానీ, మీ ఆందోళన, అభిమానం చూశాక మనసు మార్చకున్నాను. నాగలి దున్నుకునే నన్ను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశారు. గత మూడు ప్రభుత్వాలలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను కాపాడారు. అందుకే మీ కోసమే ఎన్నికల్లో నిలబడుతున్నా. నన్ను బీఆర్ఎస్ అధిష్ఠానం తప్పించిందని కొందరు శునకానందం పొందుతున్నారు. నేను ఎవరినీ నిందించను. నా శిరస్సు నరుక్కుంటా తప్ప.. నా కోసం ఎవరూ తలవంచొద్దు. నేను ఎక్కడా తలవంచేది లేదు. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారనే మీ ముందుకు వస్తున్నా’’ అని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.
అయితే తన స్పందనలో ఎక్కడా బీఆర్‌ఎస్ పైన గానీ, కేసీఆర్‌పైగానీ తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీ మారతారనే అంశంపై ఊహాగానాలు ఉన్నందున దానిపై కూడా ఏమీ మాట్లాడలేదు. కనీసం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వలేదు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలు ప్రకటించగా అందులో తుమ్మల నాగేశ్వరావు పేరు లేని సంగతి తెలిసిందే. దీంతో తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు భగ్గుమన్నారు. పార్టీ మారాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలేరు నుంచి తుమ్మలను పోటీ చేయించాలని ఆయన అనుచరులు పట్టుదలతో ఉన్నారు.
పాలేరు నుంచి ఇండిపెండెంట్ గా?
అయితే, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన తండ్రి పాలేరు నుంచే పోటీ చేస్తారని చెప్పారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ పాలేరు టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కందాలకు కేటాయించింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు ఉన్నాయి.