BRS MLAs To join BJP: ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారు - రామచంద్రరావు సంచలన ప్రకటన
BJP President Ramachandra Rao: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదుగురు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వారి పేర్లు త్వరలో ప్రకటిస్తామన్నారు.

Five BRS MLAs are ready to join the BJP: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి వచ్చేందుకు ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని.. వారు తనతో టచ్‌లో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నాయకత్వపై ఆ పార్టీ నేతలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని అందుకే ..బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రామచంద్రరావుతో సమావేశం అయ్యారు. పదో తేదీన ఆయన బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది కీలక నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఐదుగురే కాదని.. మరికొంత మంది నేతలు కూడా తమ పార్టీ వైపు చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకోవడంలేదన్నారు. సీబీఐకి ఇస్తే అసలు విషయం అంతా బయటకు వస్తుందని స్పష్టం చేశారు.
బీజేపీలో విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఇటీవలి కాలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కవిత కూడా ఆరోపించారు. అలాంటి ఆలోచనలకు వ్యతిరేకంగానే ఆమె సొంత రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల సీఎం రమేష్ కూడా అవే ఆరోపణలు చేశారు. కేటీఆర్ స్వయంగా తన వద్దకు వచ్చారని..తాను విలీనం అంశాన్ని బీజేపీ పెద్దలతో మాట్లాడానన్నారు. కానీ ఆ పార్టీని విలీనం చేసుకోవడానికి బీజేపీ పెద్దలు ఆసక్తిగా లేరన్న విషయం స్పష్టమయిదంని అదే విషయం చెప్పానన్నారు. ఈ మాటల్ని బీఆర్ఎస్ నేతలు ఖండించలేదు. కానీ కేటీఆర్ మాత్రం తెలంగాణ ఉన్నంత వరకూ బీఆర్ఎస్ ఉంటుందని.. ఏ పార్టీలో విలీనం చేయబోమంటున్నారు. బీజేపీతో చర్చలు జరిపారా లేదా అన్నది మాత్రం క్లారిటీగా చెప్పడంలేదు.
దీంతో బీజేపీతో పొత్తు లేదా విలీనం ఉంటుందన్న ప్రచారం ఊపందుకోవడంతో.. ముందుగానే బీజేపీలో చేరితే బాగుంటుంది కదా అని అనుకునే బీఆర్ఎస్ నేతల సంఖ్య పెరిగిందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని రామచంద్రరావు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ .. బీజేపీలో విలీనం అవుతుదని జోస్యం చెప్పారు. రామచంద్రరావు ప్రకటన చూస్తూంటే.. అలాంటి సూచనలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మరో వైపు భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆ పార్టీ వర్గాలంటున్నారు. తమ పార్టీ నుంచి ఎవరు ఇతర పార్టీలో చేరినా అనర్హతా వేటు పడుతందని అందుకే.. కాంగ్రెస్ లో చేరిన వారు కూడా తాము పార్టీ మారామని చెప్పుకోలేకపోతున్నారని అంటున్నారు.





















